Telugu Gateway
Telangana

కుంభకోణాల కాంగ్రెస్ ను కెసీఆర్ జాలితో వదిలేశారట!

కుంభకోణాల కాంగ్రెస్ ను కెసీఆర్ జాలితో వదిలేశారట!
X

మళ్ళీ గెలిపిస్తే చర్యలు తీసుకుంటారట

కెసీఆర్ ప్రకటనపై అధికార వర్గాల్లో విస్మయం

కుంభకోణాల కాంగ్రెస్ ను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జాలితో వదిలేశారా?. ప్రభుత్వంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని హెచ్చరించిన కెసీఆర్ ఆ తర్వాత వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, చేపల కొనుగోలు దగ్గర నుంచి పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఖండనలు ఇచ్చి వదిలేయటం తప్ప..టీఆర్ఎస్ పెద్దగా చేసింది ఏమీలేదు. నిజంగా ప్రతిపక్షాల ఆరోపణల్లో పస లేకుంటే..కెసీఆర్ ముందు హెచ్చరించినట్లుగానే కేసులు వేయాల్సింది. ఆరోపణలు చేస్తూ కొంత మంది కాంగ్రెస్ నేతలు అప్పట్లోనే సవాళ్ళు కూడా చేశారు. కానీ కెసీఆర్ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. కానీ ఇప్పుడు కెసీఆర్ ఏకంగా ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతి జరిగింది. కాంగ్రెస్ చేసిన కుంభకోణాలన్నీ తెలుసు. రాజకీయ కక్ష సాధిస్తున్నాం అంటారని ఈ నాలుగేళ్ళలో ఎవరినీ మట్టుకోలేదు అని ప్రకటించటంపై ప్రభుత్వ వర్గాల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది.

అవినీతిపై చర్యలకు ఆధారాలు ముఖ్యమా?. రాజకీయ కక్ష సాధిస్తున్నారని అంటారని వదిలేస్తారా?. ఇప్పుడు వదిలేసిన కెసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చర్యలు మొదలుపెడితే అప్పుడు కక్ష సాధింపు అనరా?. నాలుగున్నర సంవత్సరాలు వదిలేసి..మళ్ళీ అధికారం ఇస్తే అవినీతిపై చర్యలు చేపడతామని చెప్పటంలో అసలు ఏమైనా హేతుబద్ధత ఉందా?. గతంలో కెసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మైట్రో ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో విలువైన భూములు ఇచ్చారని ఇందులో స్కామ్ జరిగిందని..అధికారికంగా ఈ ఆరోపణలు పెడుతున్నానని మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో ఊసెత్తటమే మానేశారు. అంతే కాదు..టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా మెట్రో రైలు పనులు ఏడాదికిపైనే జాప్యం జరిగాయి. అంతే కాదు...పోనీ టీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని రూటులో ఏమైనా మార్పులు చేసిందా అంటే అదీ లేదు.

ఇదంతా ఒకెత్తు అయితే సాక్ష్యాత్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హౌసింగ్ స్కామ్ కు సంబంధించిన నివేదికలు ఉన్నాయి. వాటిని కూడా పక్కన పెట్టారు. రాజకీయంగా అవసరమైనప్పుడు ‘స్కామ్ లపై సమీక్షలు’ అంటూ మీడియాకు లీకులు..తర్వాత కన్వీనెంట్ గా మర్చిపోవటం. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపు అంటారని చర్యలు తీసుకోలేదు..మళ్ళీ గెలిపించండి అప్పుడు చూపిస్తాం మా తడాఖా అన్న చందంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యాఖ్యానించటం ఏ మాత్రం సమర్థనీయం కాదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కేసులు వేసిందని అసెంబ్లీని రద్దు చేశానని చెబుతున్న కెసీఆర్..ఇప్పుడు మళ్లీ అధికారం ఇస్తే కాంగ్రెస్ అక్రమార్కులపై చర్యలు చేపడతానని ప్రకటించటం విశేషం.

Next Story
Share it