Telugu Gateway
Andhra Pradesh

కెసీఆర్ కరకట్టకెళ్లి కేకేసినప్పుడు బాబు ‘ద్రోహి’ కాదా?

కెసీఆర్ కరకట్టకెళ్లి కేకేసినప్పుడు బాబు ‘ద్రోహి’ కాదా?
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ దృష్టిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్రోహి ఎప్పుడయ్యారు?. సీఎం కెసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో కరకట్టకు పోయి చంద్రబాబును తాను నిర్వహించిన ఆయుత చండీయాగానికి ఆహ్వానించినప్పుడు చంద్రబాబు మంచోడేనా?. నిజంగా చంద్రబాబు ద్రోహి అని కెసీఆర్ భావిస్తే ఆయుత చండీయాగానికి చంద్రబాబును ఎందుకు పిలిచినట్లు?. ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన కొద్ది నెలలకే కెసీఆర్ అత్యంత అట్టహాసంగా ఆయుత చండీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి స్వయంగా విజయవాడ వెళ్ళి మరీ చంద్రబాబును ఆహ్వానించి వచ్చారు. చంద్రబాబు కూడా దీనికి హాజరయ్యారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ జట్టు కట్టింది. అంతే కెసీఆర్ లో టెన్షన్ లో మొదలైనట్లు కన్పిస్తోంది. ఇప్పుడు కెసీఆర్ మూడో కన్ను తెరుస్తానని హెచ్చరిస్తున్నారు. ఇంత కాలం కెసీఆర్ ను మూడో కన్ను తెరవకుండా ఆపింది ఎవరు?.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బహిరంగంగా దొరికినా ..రేవంత్ వెనక ఉన్నది చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలిసిందే. బహిరంగ సభల్లో కూడా చంద్రబాబూ..నిన్ను బ్రహ్మాదేవుడు కూడా రక్షించలేడు అని వ్యాఖ్యానించి..తర్వాత ఆ కేసును పూర్తిగా మర్చిపోయింది కెసీఆర్ కాదా?. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి..తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే తనకు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆందోళనతోనే ఇప్పుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కెసీఆర్ విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. గురువారం నాడు నల్లగొండ సభలో కెసీఆర్ స్పీచ్ చూసిన వారెవరికైనా తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తే బాగుండదనే తరహాలో హెచ్చరిక చేసినట్లు ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నయి.

అంటే ఈ కేసును కేవలం రాజకీయ అవసరాల కోసం వాడుకునేందుకు వీలుగానే ఇంత కాలం పక్కన పడేసి..ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారన్న విషయం తేటతెల్లం అవుతుంది. అసలు తెలంగాణలో టీడీపీనే లేదని వ్యాఖ్యానించిన కెసీఆర్..చంద్రబాబు ప్రచారం చేస్తే అంతగా భయపడాల్సిన పరిస్థితి ఉందా?. నిన్న మొన్నటి వరకూ వంద సీట్లు గ్యారంటీ అంటూ ప్రకటించిన కెసీఆర్ ఇప్పుడు ఏకంగా 110 తమకు.. 7 సీట్లు ఎంఐఎంకు వస్తాయని చెప్పటం ద్వారా తాను చెప్పే లెక్కల్లో నిజం ఎంతో ఆయనే బహిర్గతం చేశారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it