Telugu Gateway
Andhra Pradesh

నెక్ట్స్ ఐటి టార్గెట్ ‘ఆ రెండు కంపెనీలేనా?’

నెక్ట్స్ ఐటి టార్గెట్ ‘ఆ రెండు కంపెనీలేనా?’
X

ఏపీలో ఏ పనికైనా ఆ రెండు కంపెనీలే. ప్రభుత్వ పెద్దలకు ఆ రెండు కంపెనీలు ‘కవల పిల్లలు’గా మారాయి. వేలాది కోట్ల రూపాయల పనులు ‘పంచటం’ కూడా కాస్తో కూస్తో అటూ ఇటూగా సమానంగానే పంచుతున్నారు. ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఇచ్చి..మరొకరికి తక్కువ చేస్తే మారాం చేస్తారు కదా?. అందుకే ఎలాంటి ‘తేడా’ చూపించకుండా పంచటంలో మాత్రం ‘సమానత్వం’ పాటిస్తున్నారు. ఇఫ్పటికే ఈ రెండు సంస్థలకు ఏపీ సర్కారు వేలాది కోట్ల రూపాయల పనులు అప్పగించింది. భవిష్యత్ లో అప్పగించే వాటిలోనూ ‘వాటాలు’ వాళ్ళవే. ప్రతిగా ఎవరికి చేరాల్సిన మొత్తం వాళ్లకు చేరుతుంది. ఏపీలో ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందనే విషయం బహిరంగ రహస్యం. రాజధాని మొదలుకుని సాగునీటి ప్రాజెక్టులు ఏదైనా సరే విచ్చలవిడి అవినీతే. చివరకు దోపిడీకి ‘మొక్కలను’ కూడా వదలటం లేదు. ఏపీలో జరుగుతున్నఈ అసాధారణ అక్రమ దందాపై కేంద్ర సంస్థలు ఎప్పటి నుంచో నిఘా పెట్టాయి.

తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ పై ఐటి దాడులు జరిగాయి. కొండను తవ్వి ఎలుకను పట్టారని సీఎం రమేష్ మీడియా మందుకు వచ్చి గంభీరంగా ప్రకటనలు అయితే చేశారు. కానీ ఐటి శాఖ అధికారులు మాత్రం ప్రాధమిక అంచనాల ప్రకారం వంద కోట్ల రూపాయలపైనే దొంగ బిల్లులు..లెక్కలతో తరలించారని నివేదిక తయారు చేసింది. ఇప్పటికే సీఎం రమేష్ కు చెందినన కంపెనీతో పాటు ఇతర కంపెనీలపై కూడా ఐటి దాడులు జరిగాయి. నెక్ట్స్ టార్గెట్ ‘ఆ రెండు ’ కంపెనీలే అని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే మొత్తం వ్యవస్థలో కదలిక రావటం ఖాయం అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ కంపెనీలకు..ప్రభుత్వంతో పెనవేసుకుపోయిన ‘బంధం’ అలాంటిది మరి?. ఏపీలో సాగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఐటి దాడులు భవిష్యత్ లోనూ కొనసాగుతాయని చెబుతున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో?.

Next Story
Share it