Telugu Gateway
Politics

టీఆర్ఎస్ అభ్యర్ధుల ‘క్యాష్ మీటర్’ రన్!

టీఆర్ఎస్ అభ్యర్ధుల ‘క్యాష్ మీటర్’ రన్!
X

ఎన్నికల బరిలో దిగటం అంటే కోట్లతో వ్యవహారం. పైకి ఎన్ని చెప్పినా ఒక్కో అభ్యర్ధి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అయినా గెలుపు గ్యారంటీ ఉండదు. అది ఏ పార్టీకి మినహాయింపు కాదు. అధికార పార్టీ..ప్రతిపక్షం ఎవరైనా సరే ‘కోట్లు’ కుమ్మరించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకూ అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించలేదు. ఎప్పుడు ప్రకటిస్తారో కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ పార్టీ అభ్యర్దులను ప్రకటించి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. అసెంబ్లీని రద్దు చేసిన సెప్టెంబర్ 6నే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి కలకలం రేపారు. ఈ నిర్ణయాన్ని అప్పటికి అందరూ ఆహా..ఓహో అంటూ కీర్తించినా ఇప్పుడు మాత్రం ‘అభ్యర్ధుల’కు చుక్కలు కనపడుతున్నాయి. అధికారికంగా అభ్యర్ధి పేరు ప్రకటించినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ ‘క్యాష్ మీటర్’ రన్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. పేరు ప్రకటించినప్పటి నుంచి అందరినీ ‘సంతృప్తి’ పర్చాల్సిందే.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందిగా అంటే..కుదరదు. పెరుగుతున్న ఖర్చుల వ్యవహారం టీఆర్ఎస్ అభ్యర్దులను ఇరకాటంలోకి నెడుతోంది. చాలా చోట్ల అభ్యర్ధులకు అధిష్టానం కొంత నగదు సర్దుబాటు చేసిందని చెబుతున్నారు. అయినా రోజురోజుకూ ఖర్చులు పెరుగుతుండటంతో టీఆర్ఎస్ అభ్యర్ధులను కలవరానికి గురిచేస్తోంది. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్ధుల ఇంకా ఖర్చు ‘ఖాతా’ కూడా తెరవని పరిస్థితి ఉంటే..ఇప్పటికే తమ ఖాతాలో ‘ఖర్చు’ మోతమోగిపోతుందని..ఎన్నికల సమయానికి డబ్బు లేకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని టీఆర్ఎస్ అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా టిక్కెట్లను ప్రకటించటం వల్ల ప్రచారంలో ముందంజలో ఉన్నా...ఖర్చు మాత్రం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అవుతుందని చాలా మంది అభ్యర్దులు లబోదిబోమంటున్నారు.

Next Story
Share it