Telugu Gateway
Telangana

తెలంగాణ కాంగ్రెస్ కు ఝలక్

తెలంగాణ కాంగ్రెస్ కు ఝలక్
X

ఊహించని పరిణామం. తెలంగాణ కాంగ్రెస్ కు ఝలక్. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు తాజా పరిణామంతో ఖంగుతిన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ భార్య పద్మినరెడ్డి బిజెపిలో చేరారు. తెలంగాణ బిజెపి శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఆమె బిజెపి కండువా కప్పుకున్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పడేసింది. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ ఈ పరిణామంపై ఎదురుదాడి ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతల భార్యలు కూడా నమ్మటం లేదంటూ సోషల్ మీడియాలో ఎటాక్ ప్రారంభించింది. దామోదర్ రాజనర్సింహ గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.

పద్మినిరరెడ్డి చేరిక సందర్భంగా మురళీధర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ ‘పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతుంది. దేవాలయాల పునరుద్దరణలో ఆమె కృషి అభినందనీయం. రాబోయే రోజులో వారి సేవలు వినియోగించుకుంటాం. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై పద్మినీ బీజేపీ పార్టీలో చేరార’ని తెలిపారు. బీజేపీలోకి పద్మినీ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా తప్పేం కాదని, ఆ స్వేచ్చ వారికి ఉందని తెలిపారు. మహిళా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఉంటుందని వెల్లడించారు.

Next Story
Share it