Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఫైటింగ్..తెలంగాణలో లవ్వా!

ఏపీలో ఫైటింగ్..తెలంగాణలో లవ్వా!
X

ఒక చోట ఫైటింగ్. మరో చోట ప్రేమ. ఇదీ కాంగ్రెస్ స్టైల్. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కు పెద్దగా పోయేదేమీ లేదు. వస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ఇది ఓ పెద్ద సమస్యగా మారబోతోంది. టీడీపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అయిన సమయంలోనే తీవ్ర విమర్శలు విన్పించాయి. అయినా సరే ముందుకు పోవటానికే టీడీపీ రెడీ అయిపోయింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ‘ఎన్టీఆర్ ఆత్మ’కు కూడా వెన్నుపోటు పొడిచారని మంత్రి కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేయటం ప్రారంభించారు. కానీ రాహుల్ గాంధీ తాజా కర్నూలు పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఈగ వాలనీయలేదు. అందుకు భిన్నంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కొద్ది రోజుల క్రితమే ఎంపీ కెవీపీ రామచంద్రరావులు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ చోట స్నేహం..మరో చోట శతృత్వం సాధ్యమవుతుందా?. ఇది రాజకీయంగా తమను భారీగా దెబ్బతీసే అవకాశం ఉందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోయింది. ఇక సీట్ల లెక్క తేలటమే తరువాయి. ఇద్దరూ కలసి ప్రచారం చేయటమే కాదు..హామీల అమలు కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రకటింటాని రెడీ అయిపోయారు. కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు రెడీ కావటాన్ని తొలుత టీడీపీ సీనియర్ నేతలు కె ఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారు తీవ్రంగా తప్పుపట్టారు. చివరకు తెలంగాణ వరకూ అయితే ఓకే అన్నారు. ఏపీలో మాత్రం సాధ్యంకాదన్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచటం కూడా వ్యూహాత్మకమేనా? అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ఎంత బలపడితే ఆ మేరకు టీడీపికి ప్రయోజనం ఉంటుందనే ‘లెక్కలు’ ఉండనే ఉన్నాయి. చూడాలి ఈ గేమ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో?

Next Story
Share it