Telugu Gateway
Andhra Pradesh

అకుంఠిత దీక్షతో ‘చంద్రబాబు ధనయజ్ఞం’

అకుంఠిత దీక్షతో ‘చంద్రబాబు ధనయజ్ఞం’
X

కాంట్రాక్టర్ల ‘రింగ్ లీడర్’గా ముఖ్యనేత

అన్ని పనులకు ఆ రెండు కంపెనీలేనా?

ఏపీలో ఏ పనులైనా అయినా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే ఎందుకు దక్కుతున్నాయి?. ఏపీసీఆర్ డీఏలో అంతే..సాగునీటి శాఖలో అంతే. వేల కోట్ల రూపాయల పనులు చేయటానికి అసలు దేశంలో కంపెనీలు ఏమీ ఆసక్తి చూపించటం లేదా?. ఆ రెండు..మూడు సంస్థలు తప్ప...దేశంలో పనికి పోటీ పడే సంస్థలే లేవా?. ఒకప్పుడు టెండర్లు బాక్సుల్లో వేసేవారు. అప్పుడు బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్లు భయ పెట్టి ప్రత్యర్ధులను టెండర్లు వేయకుండా చేసేవారు. టెండర్లలో ఆన్ లైన్ వ్యవస్థ వచ్చినా కూడా ‘సిండికేట్’ వ్యవహారం పోవటం లేదు. ఒకప్పుడు కాంట్రాక్టర్లు ‘సిండికేట్’ అయ్యేవారు. అయితే ఇప్పుడు సాక్ష్యాత్తూ ఈ సిండికేట్ కు ముఖ్యమంత్రే ‘రింగ్ లీడర్’గా మారిపోయారని ఓ కీలక శాఖకు చెందిన అధికారి వ్యాఖ్యానించారు. ఏపీలో ఇప్పుడు ముందు కాంట్రాక్టర్ ఎవరో ఖరారు అయిన తర్వాత అంచనాలు సిద్ధం చేస్తున్నారని..దానికి అనుగుణంగా ‘కమిషన్లు’ దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాజధాని పనులతో పాటు..సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు అకుంఠిత దీక్షతో ‘ధనయజ్ఞం’ చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. వైఎస్ హయాంలో జలయజ్ఞానికి ‘నవగ్రహలు’ ఉంటే..ఇప్పుడు చంద్రబాబే ‘రెండు గ్రహలను’ తన గుప్పిట్లో పెట్టుకుని అంతా నడిపిస్తున్నారు. అవే నవయుగా, మెగా. గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా పిలిచిన టెండర్లలో అచ్చం అదే జరిగింది. తొలి ప్యాకేజీ పనుల అంచనా విలువ 2176 కోట్ల రూపాయలు అయితే..దీనికి మెగా ఇంజనీరింగ్ 4.77 శాతం ఎక్సెస్ కోట్ చేసింది. నవయుగా ఇంజనీరింగ్ 4.9 శాతం ఎక్సెస్ కోట్ చేసింది. దీంతో ఎల్ 1గా నిలిచిన మెగాకు ఈ ప్రాజెక్టు దక్కనుంది. అదే సమయంలో ప్యాకేజీ2 అంచనా విలువ 2522 కోట్ల రూపాయలు అయితే..దీనికి నవయుగా 4.44 శాతం ఎక్సెస్ కోట్ చేయగా, మెగా 4.7 శాతం ఎక్సెస్ కోట్ చేసింది.

ఈ రెండు ప్యాకేజీల్లోని ఎక్సెస్ శాతాలను పరిశీలిస్తే ‘రింగ్’ వ్యవహారం స్పష్టంగా కన్పిస్తుందని..అంతా పక్కా పథకం ప్రకారమే ఇది సాగిందని సాగునీటి శాఖ వర్గాలు తెలిపాయి. ఈపీసీలో ఏ టెండర్ అయినా ఐదు శాతానికి మంచి ఎక్సెస్ వేయటానికి అనుమతించరు. ఓ వైపు అడ్డగోలుగా అంచనాలు పెంపు ఉండనే ఉంది. దీనికి తోడు మళ్ళీ రెండు టెండర్లలోనూ ఐదు శాతానికి దగ్గరగా ఎక్సెస్. బెంగూళూరుకు చెందిన ఓ అస్మదీయ సంస్థతో పాటు..మరికొన్ని కంపెనీలు కూడా ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపగా..ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులే వార్నింగ్ ఇచ్చి..రేసు నుంచి మిగిలిన సంస్థలను తప్పించారు. ఏపీలోని సాగునీటి శాఖతో పాటు వివిధ విభాగాల్లో కేవలం నవయుగా, మెగా సంస్థలకే వేలకు వేల కోట్ల రూపాయల పనులు దక్కుతున్నాయంటే ఇది ‘రింగ్ లీడర్’ పని కాక ఎవరిది అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

Next Story
Share it