Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు బాటలో యనమల అల్లుడు!

చంద్రబాబు బాటలో యనమల అల్లుడు!
X

ఏపీలోని కొంత మంది ఉన్నతాధికారులు టెండర్ల ఖరారు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రూల్స్ ను ఖచ్చితంగా ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ విషయంలో చంద్రబాబు తనకు నచ్చని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి టెండర్ దక్కటంతో మంత్రివర్గంలో పెట్టి మరీ దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక శాఖలో భాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపీఎంఎస్ ఐడీసీ) ఎండీ గోపీనాథ్ కూడా అచ్చం అలాగే చేస్తున్నారు. తనకు నచ్చిన కంపెనీలకు టెండర్లు రావనుకుంటే వాటిని ఏకపక్షంగా రద్దు చేసేస్తారు. ఆయనకు నచ్చిన కంపెనీ అయితే సింగిల్ టెండర్ అయినా..అది నిబంధనలకు విరుద్ధం అయినా అప్పగించేస్తారు. ఎందుకంటే ఆ విభాగంలో ఆయన్ను ఇదేమని ప్రశ్నించేవారు ఉండదు. అంతా ఆయన ఇష్టారాజ్యమే.

బిల్లుల చెల్లింపులో కూడా ఆయన తనదైన ‘స్టైల్’ను చూపిస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఓ జిల్లాలో కొద్ది రోజుల క్రితం 11 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇద్దరు మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. కానీ అందులో ఓ కంపెనీ సాంకేతిక అర్హత సాధించలేదు. దీంతో సింగిల్ టెండర్ అవుతుందని మొత్తం టెండర్లను రద్దు చేశారు. కానీ ఇదే గోపీనాధ్ మరో జిల్లాలో మాత్రం సింగిల్ టెండర్ అయినా 50 కోట్ల రూపాయల పనులను తనకు అస్మదీయుడైన వ్యక్తికి అప్పగించేశారు. ఇక్కడ కూడా ఇద్దరు టెండర్ దాఖలు చేస్తే ఒక సంస్థ సాంకేతిక అర్హత సాధించలేదు.

అయినా సరే అస్మదీయుడు కాబట్టి 50 కోట్ల పనులు అప్పగించేశారు. కానీ పదకొండు కోట్ల పనులను మాత్రం సింగిల్ టెండర్ అని రద్దు చేశారు. వైజాగ్, శ్రీకాకుళం జిల్లాల్లోనూ అదే మోడల్ ఫాలో అయ్యారు. అంటే గోపీనాథ్ టెండర్ టెండర్ కో కొత్త రూల్ పెడుతున్నారన్న మాట. అంటే ఏమీ లేదు..తనకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఓకే..లేదంటే టెండర్ రద్దే. ఇలాంటి అడ్డగోలు ఉల్లంఘనలు ఎన్నో ఎపీఎంఎస్ ఐడీసీలో సాగుతున్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ టెండర్ల గోల్ మాల్ పై విచారణ జరిపిస్తే ఇలాంటి సంచలన విషయాలు..అక్రమాలు ఎన్నో వెలుగులోకి వస్తాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు మంత్రే లేరు. సీఎం దగ్గరే ఆ శాఖ ఉంది. అయినా సరే గోపీనాథ్ మాత్రం తన ఇష్టారాజ్యంగా నడిపించేస్తున్నారు. ఇటీవలే నల్లగొండలో తన భార్య పేరు మీద ఖరీదైన కారు రిజిస్టర్ చేయించి వివాదంలో చిక్కుకున్నారు ఆయన.

Next Story
Share it