Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ కు అంత ఖంగారెందుకో?

టీఆర్ఎస్ కు అంత ఖంగారెందుకో?
X

‘కోదండరాం ఏ నాడు అయినా సర్పంచ్ గా గెలిచిండా?. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నేను నాయకుడిని చేసినా’ ఇవీ కొద్ది కాలం క్రితం ప్రస్తుత టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంనుద్దేశించి టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు. టీడీపీనా..ఆ పార్టీ ఉందా తెలంగాణలో?. ఏ సర్వే చేసినా కూడా ఒక శాతం కూడా లేదు ఆ పార్టీకి ఓటింగ్. ఇదీ అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసీఆర్ చెప్పిన మాటలు. ఇవన్నీ నిజమే అయితే...సర్పంచ్ గా కూడా గెలవని కోదండరాం పొత్తుపై టీఆర్ఎస్ కు అంత ఖంగారెందుకు?. ఒక శాతం కూడా ఓటు బ్యాంకులేని టీడీపీ మహాకూటమిలో ఉంటే టీఆర్ఎస్ కు వచ్చే నష్టమేంటి?. మహాకూటమి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను భారీగా దెబ్బతీసే అవకాశం ఉండటంతోనే గత కొన్ని రోజులుగా మంత్రులు కెటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవితలు కోదండరామ్ తో పాటు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. పదే పదే ఇదే విషయాలను ప్రస్తావిస్తున్నారు.

కోదండరాంకు చెందిన టీజెఎస్, టీడీపీలతో కాంగ్రెస్ పొత్తునే ఓ పెద్ద అస్త్రంగా చేసుకుని టీఆర్ఎస్ విమర్శల స్పీడ్ పెంచింది. కెసీఆర్ చెప్పినట్లు సర్పంచ్ గా గెలవలేని కోదండరాం ఎవరితో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ కు ఏమి అవుతుంది?. ఒక్క శాతం ఓటు కూడా లేని టీడీపీ కాంగ్రెస్ తో కలిస్తే టీఆర్ఎస్ కు జరిగే నష్టం ఏముంటుంది?. నిజంగా ఈ మహాకూటమిపై ఏ మాత్రం భయం లేకపోతే పదే పదే ఏ మాత్రం బలం లేదని భావిస్తున్న పార్టీలను టార్గెట్ చేయటం వెనక మతలబు ఏమిటి?. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కు పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదనే ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎలాగోలా మరోసారి ‘సెంటిమెంట్ల’ను రాజేసి ఎన్నికల్లో గెలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది గులాబీ పార్టీ. అందుకే కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీకి గులాంలు..టీడీపీ గెలిస్తే అమరావతికి గులాంలు అంటూ కొత్త పల్లవి అందుకుంది. కానీ హైదరాబాద్ లో ఉండి కూడా సీఎం కెసీఆర్ పలు సందర్భాల్లో మంత్రులు..సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వని విషయాన్ని కన్వీనెంట్ గా మర్చిపోతుంది.

Next Story
Share it