Telugu Gateway
Telangana

కెసీఆర్ పై మండిపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు!

కెసీఆర్ పై మండిపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు!
X

అదుగో మధ్యంతర భృతి(ఐఆర్). ఇదిగో మధ్యంతర భృతి. సీఎం కెసీఆర్ 25 శాతం వరకూ ఇద్దామనుకుంటున్నారు. కానీ ఆర్థిక శాఖ మాత్రం 18 శాతానికే ఫైలు రెడీ చేసింది. ఇదీ గత వారం రోజులుగా సాగిన చర్చ. పత్రికల్లె జరిగిన ప్రచారం. కానీ అసలు మధ్యంతర భృతి ఊసే లేకుండా కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. సీఎం కాస్తా..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయారు. అంతే ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి రెడీ అవుతున్నా..ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కెసీఆర్ తీరుపై మండిపడుతున్నారు. ఓ వైపు విద్యుత్ ఉద్యోగులకు అడిగిన దానికంటే ఎక్కువ పీఆర్సీ ప్రకటించి..తమను నిర్లక్ష్యం చేయటంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కెసీఆర్ సీఎం అయిన తర్వాత తొలిసారి ఇచ్చిన పీఆర్సీపై ఉద్యోగులు సంతృప్తికరంగానే ఉన్నా...ఎన్నికల సమయంలో పీఆర్సీ వేసి కనీసం అసలు మధ్యంతర భృతి కూడా ప్రకటించకుండా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవటం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. కంట్రిట్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నా కెసీఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదు.

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ స్వప్రయోజనాల కోసం లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో హీట్ ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా తగులుతోంది. రాబోయే రోజుల్లో ఉద్యోగులు బహిరంగంగానే ఈ అంశంపై మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఎందుకంటే వీరి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు...ప్రభావితం చేయటంలో కూడా వీరు కీలకపాత్ర పోషిస్తారు. ముఖ్యంగా టీచర్లు ఇందులో ముందు వరసలో ఉంటారు. మరి కెసీఆర్ ఆగమేఘాల మీద అన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు కానీ..ఉద్యోగులను మాత్రం విస్మరించారు. ఈ ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it