Telugu Gateway
Telangana

‘తెలంగాణ’ ముందస్తుపై సుప్రీంకోర్టులో పిటీషన్

‘తెలంగాణ’ ముందస్తుపై సుప్రీంకోర్టులో పిటీషన్
X

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతే కాదు.. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెబుతోంది. అయితే హైకోర్టు మాత్రం ఓటర్ల జాబితా సవరణ గడువును ముందుకు జరపటం సబబే అని తేల్చిచెప్పింది. ఈ తరుణంలో ముందస్తుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. సిద్ధిపేటకు చెందిన శశాంక్ రెడ్డి అనే వ్యక్తి ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఏ మాత్రం అవసరం లేకపోయినా..సర్కారుకు పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. దీని వల్ల 20 లక్షల మంది యువత తమ ఓటు హక్కును కోల్పోతారని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయటమే అని పిటీషనర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా ఎన్నికల సంఘంతో మాట్లాడానని..ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి..ఫలితాలు ఎప్పుడు వస్తాయో కూడా ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ అనిశ్చితి, సంక్షోభం లేకపోయినా కేవలం రాజకీయపరమైన లబ్ధి కోసమే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తెలంగాణకు కూడా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన కోర్టును కోరారు. అప్పటి వరకూ రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి ఆధారాలతో సహా సుప్రీంను ఆశ్రయిస్తామని చెబుతోంది. ఈ వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it