Telugu Gateway
Politics

వరాల కోసం ఓ కేబినెట్..రద్దు కు మరో సారి!

వరాల కోసం ఓ కేబినెట్..రద్దు కు మరో సారి!
X

అసెంబ్లీ రద్దు ఎప్పుడు ఉంటుంది?. ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో కేవలం ప్రగతి నివేదన సభలో ప్రకటించే వరాల ఆమోదం కోసమే అని చెబుతున్నారు. మంత్రివర్గ ఆమోదం తీసుకుని..వరాలను ప్రకటించేసి..వాటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యేలా చూడటం ఒకెత్తు. మెజారిటీ గల ప్రభుత్వంగా ఈ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. వరాల ఆమోదం కోసం జరిగే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏ మాత్రం ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు అన్నీ పూర్తయ్యాయని నిర్ధారణకు వచ్చిన తర్వాతే మరోసారి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు నుంచి అటే సీఎం కెసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తెలియజేస్తారు. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. రోజువారీ వ్యవహారాలు చూడటం మినహా...ఈ సర్కారుకు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు.

ఎలాగైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్న సీఎం కెసీఆర్ ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఇక ఎన్నికల బంతి కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళుతుంది. సీఎం కెసీఆర్ ముఖ్యంగా నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ లోనే తమ ఎన్నికలు పూర్తి కావాలనే యోచనలో ఉన్నారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెల్లడిపై నిర్ణయం తీసుకుంటుంది. ఏది ఏమైనా ఆదివారం నాడు జరిగే భారీ బహిరంగ సభతో తెలంగాణలో ఎన్నికల నగరా మోగినట్లే భావించవచ్చు. గత చరిత్ర చూసుకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన ఎవరూ కూడా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. మరి కెసీఆర్ కు ఫలితం ఎలా వస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it