Telugu Gateway
Politics

టార్గెట్ ‘కెసీఆర్’

టార్గెట్ ‘కెసీఆర్’
X

టార్గెట్ కెసీఆర్. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అదికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇది ఓ కొత్త చరిత్ర కిందే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిద్ధాంతపరంగా పూర్తి భిన్న ధృవాలు అయిన కాంగ్రెస్, టీడీపీలు తొలిసారి కలసి పోటీ చేయనున్నాయి. రాజకీయాల్లో ఇది ఓ పెద్ద సంచలనం కానుంది. అయితే ఈ ప్రభావం తెలుగుదేశం పార్టీపై ఏ మేరకు ఉంటుందనే అంశంపై రకరకాల వాదనలు విన్పిస్తున్నాయి. అయినా సరే తెలుగుదేశం అధిష్టానం తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి ముందుకు సాగేందుకే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉంటే లాభమే తప్ప..పెద్దగా నష్టం మాత్రం ఉండదు. అయితే టీడీపీ పరిస్థితి ఏంటి అనేది ఎన్నికల తర్వాత మాత్రమే తేలనుంది. తెలంగాణలో పొత్తు పెట్టుకుని ...ఏపీలో మాత్రం ఆ పార్టీతో మాకేమి సంబంధం లేదు అంటే ఓటర్లు అంత ఈజీగా మర్చిపోతారా?. ఈ పొత్తు ప్రభావం ఏపీపై కూడా ఉంటుందా?. అన్నదే ఇప్పుడు సస్పెన్స్. విభజన సమయంలోనూ..ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు చంద్రబాబు అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ తో పొత్తుకు ఓకే చెప్పేశారు. అయితే ఈ కూటమిలోకి కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి (టీజెఎస్) వస్తుందా? రాదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే టిక్కెట్ల కేటాయింపు అంశంలో ఆయా పార్టీల మధ్య ‘లెక్కలు’ కుదురకపోవటం ఓ పెద్ద సమస్యగా మారినట్లు కన్పిస్తోంది.

మంగళవారం నాడు ఓ స్టార్ హోటల్ లో సమావేశం అయిన ఆయా పార్టీ నాయకులు పొత్తు అంశంపై చర్చించారు. కేవలం పార్టీలతోనే కాకుండా ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలసి వెళతామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పొత్తులపై ప్రాథమిక చర్చలే జరిగాయని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టోను ఉమ్మడిగా ప్రజల ముందుంచుతామన్నారు. కేసీఆర్‌లో నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. విపక్షాల పొత్తుతో కేసీఆర్‌కు చెక్‌ పెడతామని టీటీడీపీ నేత ఎల్‌ రమణ అన్నారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవ్వరితో చర్చలు జరపకుండా అసెంబ్లీని ఆదరాబాదరాగా రద్దు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కుతోందన్నారు. మహాకూటమి నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నేతలు పేర్కొన్నారు.

Next Story
Share it