Telugu Gateway
Top Stories

శబరిమలలో మహిళలకూ అనుమతి

శబరిమలలో మహిళలకూ అనుమతి
X

సంచలనం. నిజంగా ఇది ఓ సంచలనమే. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు బద్దలు కొట్టింది. శబరిమల ఆలయంలో ఇప్పటివరకూ మహిళలకు ప్రవేశం లేదు. కానీ ఇప్పుడు మహిళలు కూడా ఈ ఆలయంలోకి వెళ్ళొచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు సందర్భంగా దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళలు పూజలు చేసేందుకు అనుమతించాలని, మహిళలు దేవతలతో సమానమని ధర్మాసనం అభివర్ణించింది. శారీరక మార్పులను సాకుగా చూపి, మహిళలపై వివక్ష చూపడం సరికాదని సీజేఐ దీపక్‌ మిశ్రా అన్నారు.

దేవతలను పూజిస్తూ.. మహిళలను సమదృష్టితో చూడకపోవడం సబబు కాదన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువమేమీ కాదని, చట్టాలు, సమాజం అందరినీ గౌరవించాలని పేర్కొన్నారు. 4-1 మెజార్టీతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. పదేళ్ళ నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు శబరిమల దేవాలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కొన్నేళ్ల పాటు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత ఆగస్టులో తీర్పును వాయిదా వేసింది. ఇన్ని రోజుల పాటు తీర్పును రిజర్వులో ఉంచిన అత్యున్నత న్యాయస్థానం, నేడు ఈ తీర్పు వెల్లడించింది. రుతుస్రావం జరిగే 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం లేదన్న నిబంధనను పలువురు మహిళా న్యాయవాదులు తప్పుబట్టారు. కేరళ హిందూ ఆలయాలకు సంబంధించి ఉన్న రూల్3(బి)ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలోనే తాజా తీర్పు వెలువడింది.

Next Story
Share it