Telugu Gateway
Politics

మోడీని చూసి ‘నవ్వుతున్న’ రూపాయి!

మోడీని చూసి ‘నవ్వుతున్న’ రూపాయి!
X

‘ఆర్థికవేత్త దేశ ప్రధానిగా ఉన్నా దేశీయ కరెన్సీ రూపాయి ఐసీయూలో ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఐసీయూ నుంచి మాత్రం బయటకు రావటం లేదు. యూపీఏకు ఆర్థిక వ్యవస్థ..రూపాయి విలువ పతనంపై ఏ మాత్రం శ్రద్ద లేదు. ఎంతసేపూ వాళ్లకు తమ సీటుపైనే ధ్యాస’ ఇవీ 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించిన అంశాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ఆర్ధికవేత్త అయి కూడా రూపాయి పతనాన్ని నిలువరించలేకపోయారని విమర్శించేవారు. ఇప్పుడు మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ప్రస్తుతం డాలర్ మారకంతో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి చేరుకుంటోంది. యూపీఏ హయాంలోనూ రికార్డు పతనాలు ఉన్నా..వెంటనే కొలుకునేది. కానీ ఇప్పుడు మాత్రం అలా పతనం అవుతూనే వస్తోంది. ఇదే ఆర్థికవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం నాడు రూపాయి తొలిసారి డాలర్ తో పోలిస్తే 71కి పడిపోయింది. ఇదే అత్యంత కనిష్టం కావటం విశేషం.

రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి చేరుతుండటంతో దిగుమతులపై ఆధారపడిన రంగాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.. చూస్తుంటే గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా రూపాయి విలువ క్షీణత అంశం ఎన్నికల అంశంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. అప్పట్లో మన్మోహన్ సింగ్ ను రూపాయిపై విమర్శించిన మోడీ ఇఫ్పుడు మాత్రం దీనిపై నోరు విప్పటం లేదు. అయితే ఆర్థికవేత్తలు మాత్రం రూపాయి క్షీణతపై భయపడాల్సిన పనేమీలేదని..ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల కరెన్సీలు కూడా కుదుపునకు గురవుతున్నాయని చెబుతున్నారు.

రూపాయి విలువ క్షీణత పారిశ్రామిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుండగా..ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చిన్న, మధ్యతరహా సంస్థలను దారుణంగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు చేసినా సర్కులేషన్ లో ఉన్న మొత్తం నిధులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. దీంతో దీని వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు అవటం మాత్రం సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. గత తొమ్మిది త్రైమాసికాల్లో ఇదే అత్యధిక స్థాయి కావటం విశేషం.

Next Story
Share it