Telugu Gateway
Telangana

రేవంత్ పై మీడియాకు ‘అక్రమాల పుస్తకం’ పంపిన ప్రత్యర్థి పార్టీ

రేవంత్ పై మీడియాకు ‘అక్రమాల పుస్తకం’ పంపిన ప్రత్యర్థి పార్టీ
X

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఐటి దాడులు. గురువారం నాడు కలకలం రేపిన అంశం ఇది. దీనిపై కాంగ్రెస్ విమర్శలు. వెంటనే ప్రధాన పార్టీలు అయిన బిజెపి, టీఆర్ఎస్ లు ఈ దాడులతో మాకేమి సంబంధం అంటూ ఖండనలు. అటు మోడీకి, ఇటు కెసీఆర్ కూ అసలు దీంతో సంబంధం ఎలా ఉంటుంది?. ఆ అవసరం ఏముంటుంది? అంటూ ప్రశ్నలు. కానీ గురువారం సాయంత్రానికి అన్ని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు 70 పేజీల స్పైరల్ బైండింగ్ బుక్ వచ్చిపడింది. అందులో కాంగ్రెస్ నేత అక్రమాలకు సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి. లావాదేవీలకు సంబంధించిన చెక్కుల వివరాలు..భూ లావాదేవీలకు సంబంధించిన పలు అంశాలు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అందులో ఉన్నాయి. ఓ పక్కన రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్ళపై దాడులు కొనసాగుతుండగా..సాయంత్రం ఆరేడు గంటల సమయంలో అంత పకడ్భందీగా అన్ని ఆధారాలను డాక్యుమెంట్లను మీడియా సంస్థలకు అందజేశారంటే అందులో ఎవరూ లేరని నమ్మాలా?.

రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడి ఉంటే ఆయనపై కేసు పెడతారు?. ఆయా ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయి. అది వేరే విషయం. కానీ తమకు ఈ కేసుకు సంబంధం ఏ మాత్రం లేదని పలు పార్టీలు పదే పదే ప్రకటిస్తుండటంతోనే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. అంతే కాదు..ఈ మధ్యే పలు ఛానళ్ళలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన ఓ బడా వ్యక్తి తొలి సారి ఛానల్ కార్యాలయానికి వచ్చి మరీ...ఆ వివరాలు అందజేసినట్లు మీడియా సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. రేవంత్ రెడ్డి చేసింది అక్రమమా?. సక్రమమా? అన్నది విచారణా సంస్థలు..కోర్టులు మాత్రమే తేల్చాలి. కానీ ఇది మాత్రం ముందస్తు ఎన్నికల వేళ ‘పక్కా టార్గెట్ రేవంత్’గానే సాగిందనేది మాత్రం వాస్తవం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకు బలమైన కారణం ఆ పార్టీ మీడియా సంస్థకు పంపిన పుస్తకాన్నే ఉదాహరణగా చూపుతున్నాయి.

Next Story
Share it