Telugu Gateway
Politics

చంద్రబాబుకు ప్రేమతో..మీ రాహుల్ గాంధీ

చంద్రబాబుకు ప్రేమతో..మీ రాహుల్ గాంధీ
X

తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కెసీఆర్ పై విమర్శల రాళ్లు వేశారు. కానీ ఏపీ పర్యటనకు వచ్చేసరికి మాత్రం చంద్రబాబుకు ‘కన్నుగీటారు’. నిన్న మొన్నటి వరకూ ఏపీ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. కానీ విచిత్రం ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ ఏపీలో జరుగుతున్న అడ్డగోలుగా అవినీతిపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వింతల్లోకెళ్ల వింత. అదే రాహుల్ గాంధీ తెలంగాణ లో ‘అవినీతి’కి కొత్త పేరు పెట్టారని..అదే రీడిజైనింగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో కెసీఆర్ ఫ్యామిలీపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ విమర్శలు చేయటం పెద్ద తప్పు..నేరం ఏమీ కాదు. ఆ విమర్శలకు ఎలాగూ టీఆర్ఎస్ సమాదానం ఇస్తుంది..ఇచ్చేసింది కూడా. కానీ ఏపీలో మాత్రం అవినీతి విషయంతో, చంద్రబాబు పాలనపై కనీసం పన్నెత్తి మాట మాట్లాడకపోవటం కాంగ్రెస్, టీడీపీల మధ్య బలోపేతం అవుతున్న బంధాన్ని తెలియజేస్తుంది. అందుకే గతంలో రాహుల్ ఏపీ పర్యటనను తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు..ఈ సారి మాత్రం స్వాగతం పలికిన రీతిలో ఏర్పాట్లు చేశారు. రాహుల్ తన కర్నూలు పర్యటనలో ప్రదానంగా ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు చేశారు.

ప్రత్యేక హోదా అంశంపై మరోసారి హామీ ఇచ్చారు. దేశ స్థాయిలో మోడీ ఇచ్చిన హామీలు, రాఫెల్ డీల్ ,విజయమాల్యా పరారి వంటి అంశాలకే పరిమితం అయ్యారు. బిజెపికి దూరమైనప్పటి దగ్గర నుంచి చంద్రబాబు కాంగ్రెస్ తో స్నేహం కొనసాగించేందుకు వీలున్న ప్రతి చోటా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో అధికారికంగా పొత్తుకు రెడీ అయిపోయారు. తాజా పరిణామాలు గమనిస్తుంటే..ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు చేసిన విమర్శలు అన్నింటిని వెనక్కి తీసుకున్నట్లేనా?. మొత్తానికి ఇద్దరూ అన్నీ మర్చిపోయి ‘డ్యూయెట్లు’ పాడుకోవటానికి రెడీ అయిపోయినట్లే కన్పిస్తోంది.

Next Story
Share it