Telugu Gateway
Telangana

రాహుల్ గాంధీ ‘రేవంత్’ వైపే!

రాహుల్ గాంధీ ‘రేవంత్’ వైపే!
X

రేవంత్ రెడ్డికి ఎలాగైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు దక్కకుండా చూడాలి. ఇదీ కొంత మంది తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్లాన్. రేవంత్ కు ఆ పదవి ఇస్తే చాలా సీరియస్ గా స్పందించాల్సి ఉంటుంది. ఇదీ ఓ సీనియర్ నేత వార్నింగ్. మరి నువ్వు ప్రచారం చేసి కాంగ్రెస్ ను గెలిపిస్తావా? అంటే నాతో ఎక్కడైద్ది అనే సమాధానం. రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ ఛైర్మన్ ఇస్తే మేం ఆయన పక్కన నిలబడాలా?. ఇది మరో నాయకుడి కామెంట్. ఏతావాతా కాంగ్రెస్ సీనియర్లు అందరూ రేవంత్ రెడ్డి పదవిని అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరినీ పిలిచి రాహుల్ ఈ విషయం స్పష్టం చేయకపోవటం వల్ల పార్టీ నష్టపోతుందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ను మాటల్లో ధీటుగా ఎదుర్కొవాలంటే ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ సరిపోరు అనేది ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తారు. ఈ పని ఒక్క రేవంత్ రెడ్డి అయితే సమర్థవంతంగా నిర్వహిస్తారనే అభిప్రాయం కూడా ఉంది. అధిష్టానం కూడా ఇదే నమ్ముతోంది.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు నేతలు రేవంత్ రెడ్డికి పదవి రాకుండా అడ్డుపడుతున్నారనే ప్రచారం పార్టీ నేతల్లో ఉంది. ఉత్తమ్ కు, రేవంత్ కు మధ్య దూరం కూడా బాగానే పెరిగింది. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఖరిపై చాలా మంది సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముందస్తు ఎన్నికలు ఆయన పదవిని కాపాడినట్లే అని చెబుతున్నారు. ఈ తరుణంలో పెండింగ్ లో ఉన్న పోస్టులు భర్తీ తప్ప..టీపీపీసీ వంటి వాటి జోలికి పోయే ఛాన్స్ లేదని చెబుతున్నారు. పలు జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ పై వ్యతిరేకత గణనీయంగా ఉందని..కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే గెలుపు ఖాయం అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు కుదిరితే గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని..అయితే కాంగ్రెస్ నేతలు ఎంత ఐకమత్యంతో ఉంటారనేదే ఇప్పుడు కీలకం కానుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పదవితో పాటు పలు అంశాల్లో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it