Telugu Gateway
Telangana

రేవంత్ కు నోటీసులు ఓకే..మ‌రి ఎన్టీవీ చౌద‌రిని వ‌దిలేశారే?

రేవంత్ కు నోటీసులు ఓకే..మ‌రి ఎన్టీవీ చౌద‌రిని వ‌దిలేశారే?
X

అదేమి విచిత్ర‌మో కానీ..టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్నంత కాలం అస‌లు పాత కేసుల ఊసే లేదు. ఎప్పుడో 2004 కేసుకు సంబంధించి అక‌స్మికంగా ఫిర్యాదు..కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి అరెస్టు. ఇప్పుడు మ‌ళ్ళీ మ‌రో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి 2001 నాటికి కేసుకు సంబంధించి నోటీసులు. ఈ ప‌రిణామాలు అన్నీ చూస్తుంటే వంద సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్న టీఆర్ఎస్ కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రారంభం అయింది. త‌ప్పు చేసిన వారిపై కేసులు..చ‌ర్య‌ల‌పై ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌రు. కానీ ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో ఉన్నంత కాలం చ‌ర్య‌లు వ‌దిలేసి..ఇప్పుడు ఆక‌స్మికంగా వీటి అన్నింటిని తెర‌పైకి తేవ‌టం రాజ‌కీయం కాక మ‌రేమి ఉంటుంది. ఇక్క‌డ ప్ర‌భుత్వానికి ఓ వెసులుబాటు కూడా ఉంది. ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం ఇలాంటి ప‌నులు చేయ‌టం లేదు. పోలీసులు మాత్ర‌మే చేస్తున్నారు అని చెప్పి త‌ప్పించుకోవ‌చ్చు. కానీ ప్ర‌జ‌లు అంత అమాయ‌కులా?. అందునా కేవ‌లం కాంగ్రెస్ నేత‌లపై కేసులే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయా?. అంటే ప్ర‌భుత్వం తెర వెన‌క ఉండి ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపిస్తుంద‌నే విష‌యం ఎవ‌రైనా తేలిగ్గా అర్థం చేసుకోవ‌చ్చు. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్ర‌మాల కేసులో తాజాగా రేవంత్ రెడ్డికి జూబ్లిహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఆయ‌న‌తోపాటు మ‌రికొంత మందికి కూడా నోటీసులు వెళ్లాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో ఎన్టీవీ చౌద‌రిపై కూడా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న అక్ర‌మాల‌కు సంబంధించి ఏకంగా విజిలెన్స్ నివేదిక కూడా ఉంది. అది ప్ర‌భుత్వం వ‌ద్ద గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పెండింగ్ లో ఉంది. రేవంత్ రెడ్డికి ఇదే హౌసింగ్ సొసైటీ కేసులో నోటీసులు ఇచ్చి..ఎన్టీవీ చౌద‌రిని వ‌దిలేయ‌టం వెన‌క మ‌త‌ల‌బు ఏమిటి?. చేతిలో మీడియా ఉంది కాబ‌ట్టి వ‌దిలేశారా?. అందులో ఎన్నిక‌ల సీజ‌న్. కొంత మంది పెద్ద‌లు మీడియాను ర‌క‌ర‌కాల అంశాల‌తో నియంత్రిస్తున్నారు. ఇక కేసులు ఉన్న మీడియా సంస్థ‌లు ఉంటే పాల‌కుల‌కు ప‌ని సుల‌భం . జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అక్ర‌మాల విష‌యంపై చ‌ర్య‌లు తీసుకోద‌ల‌చుకుంటే అంతా స‌మానంగా ఉండాలి క‌దా?. కానీ ఓ మీడియా అధినేత‌ను వ‌దిలేసి..కేవ‌లం ఎంపిక చేసిన వారికే నోటీసులు జారీ చేయ‌టం రాజ‌కీయం కాక మ‌రేమిట‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఎన్టీవీకి చెందిన నరేంద్ర చౌద‌రి సొసైటీ ప్రెసిడెంట్ గా ప‌నిచేసిన స‌మ‌యంలో ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డి కోట్లాది రూపాయ‌ల మేర అనుచిత ల‌బ్ధి పొందిన‌ట్లు గుర్తించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర్య‌లు లేవు.

Next Story
Share it