Telugu Gateway
Politics

అరుణ్ జైట్లీపై విజయ్ మాల్యా బాంబు

అరుణ్  జైట్లీపై విజయ్ మాల్యా బాంబు
X

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఊహించని షాక్. దేశంలోని బ్యాంకులకు 9000 కోట్ల రూపాయల మేర ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతోంది. భారత్ వదిలి వెళ్లే ముందు తాను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలసి బ్యాంకు అంశాలు సెటిల్ చేసుకునేందుకు పలు ప్రతిపాదనలు పెట్టినట్లు విజయ్ మాల్యా ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఈ ప్రకటన పూర్తిగా తప్పు అంటూనే..ఓ సారి పార్లమెంట్ లాబీల్లో హడావుడిగా ఏదో మాట్లాడారు తప్ప..తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని అరుణ్ జైట్లీ ప్రకటించారు.

మాల్యా ప్రకటనపై కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. లండన్ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ విజయ్ మాల్యా తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే అరుణ్ జైట్లీ మాత్రం తనతో ఆఫర్ల గురించి చర్చించేది ఏమీలేదని..ఏమి ఉన్నా బ్యాంకులతో మాట్లాడుకోవాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా మాల్యా మాటలను పట్టుకుని విపక్షాలు సర్కారుపై దాడిని ముమ్మరం చేశాయి. గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సమ్మతి లేకుండా మాల్యా విదేశాలకు ఎలా పారిపోగలడని ప్రశ్నించింది. ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ దాడి ప్రారంభించారు.

Next Story
Share it