Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ప్రయోజనాలు ‘కృష్ణపట్నం పోర్టు’కు తాకట్టు!

ఏపీ ప్రయోజనాలు ‘కృష్ణపట్నం పోర్టు’కు తాకట్టు!
X

విభజన చట్టంలోని మేజర్ పోర్టును మైనర్ పోర్టుగా మార్పు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణపట్నం పోర్టుకు తాకట్టు పెట్టారా?. అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ పోర్టుకు చెందిన సంస్థ ప్రయోజనాలు కాపాడేందుకు చంద్రబాబు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగమే విభజన చట్టంలో కేంద్రం ఇస్తానన్న మేజర్ పోర్టును ఇప్పుడు మైనర్ పోర్టుగా మార్చబోతున్నారు. అంతే కాదు..విభజన చట్టంలో ఉన్న పోర్టు అంశాన్ని వదిలేసి..రామాయపట్నం పోర్టును సొంత వనరులతోనే అభివృద్ధి చేస్తామని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే చట్టబద్ధంగా ఉన్న హక్కును కూడా వదిలేసుకుని...ప్రైవేట్ సంస్థ ప్రయోజనాలు కాపాడేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమే అని మౌలికసదుపాయల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మేజర్ పోర్టుకు..మైనర్ పోర్టుకు వ్యత్యాసం చాలా ఉంటుందని..ఓ వైపు కేంద్రం తన సొంత నిధులతో చేపట్టాల్సిన మేజర్ పోర్టును ఏకంగా మైనర్ పోర్టుకు మార్చటం వెనక ఆ కంపెనీ ప్రయోజనాలు కాపాడటం కోసమే అన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

దుగరాజపట్నం లో ఓడరేవును కూడా ఈ సంస్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అడ్డుకున్నారని చెబుతున్నారు. ఇఫ్పుడు రామాయపట్నంలో ఓడరేవు సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకమే అని రైట్స్ సంస్థ నివేదిక ఇఛ్చింది. అయితే దీని కోసం కృష్ణపట్నం ఓడరేవుకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన ‘ప్రత్యేక హక్కు’లను సవరించాల్సిన అవసరం ఉంది. తొలుత కుదిరిన రాయితీ ఒప్పందానికి భిన్నంగా వైఎస్ హయాంలో ఈ ఓడరేవుకు మేలుచేసేలా సముద్రంపై ప్రత్యేక హక్కులు కల్పించారు. అప్పట్లో దీన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. ఇఫ్పుడు మాత్రం ఆ సంస్థకు ప్రభుత్వం తరపున అడ్డగోలుగా మేళ్ళు చేస్తోంది. రామాయపట్నంలో మేజర్ పోర్టు వస్తే ఆ ప్రభావం కృష్ణపట్నం పోర్టు వ్యాపారంపై ఉంటుంది. అందుకే ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి కేంద్రం ఇస్తానన్న పోర్టును మైనర్ పోర్టుగా మార్చుతూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది.

కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (కెపీసీఎల్)తో చర్చించి ప్రత్యేక హక్కులు కుదించటంతోపాటు..రామాయపట్నం పోర్టును నాన్ మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయటానికి, పోర్టు అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుకు అర్హత గల ఏజెన్సీలను ఎంపిక చేసే బాధ్యతను డైరక్టర్ ఆఫ్ పోర్ట్స్ కు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ గోల్ మాల్ చేసి ఈ పోర్టును కూడా కృష్ణపట్నం యాజమాన్యానికే అప్పగించినా ఆశ్చర్యం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it