Telugu Gateway
Politics

టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు నాకు నోటీసులిస్తారా?

టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు నాకు నోటీసులిస్తారా?
X

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే స్టాండ్. కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనకు నోటీసులు ఇఛ్చిన వారిపై తీవ్ర విమర్శలు చేశారు. టిక్కెట్లు అమ్ముకునే వారు తనకు నోటీసులు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మంచి కోరే తాను విమర్శలు చేశాను తప్ప..మరొకటి కాదన్నారు. తన విమర్శలను సానుకూలంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఉపయోగించుకోవాలని అన్నారు. తమ లాంటి వారందరూ కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించాలా? అని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో కెసీఆర్ కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను తిడితేనే పదువులు ఇస్తారా అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సీనియర్లను పట్టించుకోకుండా కమిటీ వేశారనేది తన ఆవేదనని, ఇది అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడినవారిని పక్కన పెట్టారని, షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం కాదని, తన సూచనలను సానుకూలంగా తీసుకోవాలన్నారు. కార్యకర్తల ఆవేదనను వ్యక్తం చేశానని.. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తమలాంటి నేతలను ఉపయోగించుకోవాలన్నారు.

కొత్తగా పార్టీలో చేరిన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ ఎందుకు పుంజుకోలేదో టీపీసీసీ సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కమిటీల విషయంలో తమ అధినేత రాహుల్‌ గాంధీని తప్పుదోవ పట్టించారన్నారు. పార్టీ మారిన సురేశ్‌ రెడ్డి పేరు కూడా కమిటీలో ఉండటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. బయటకు విడుదల చేసే ముందు పీసీసీ నేతలు కనీసం ఓ సారి చదువుకోరా?. నిద్రపోతున్నారా?అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లు నిండిన వాళ్లు కూడా పోటీ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీని గెలిపించే ఆలోచన చేయాలని కోరుతున్నానని తెలిపారు. తను ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని, తనలాంటి వ్యక్తిని కోల్పోతే పార్టీకే నష్టమన్నారు. రేవంత్ రెడ్డిని పార్టీలోకి రావాలని ఆహ్వానించిందే తాను అని..ఈ విషయం రేవంత్ రెడ్డిని అడిగినా చెబుతాడని పేర్కొన్నారు. తాను వ్యక్తుల గురించి మాట్లాడటం లేదని..పార్టీ సంక్షేమం గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. బలమైన నాయకులను నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల ఆవేదననే తాను చెప్పానన్నారు.

Next Story
Share it