Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ లో ‘హరీష్’ వ్యాఖ్యల కలకలం!

టీఆర్ఎస్ లో ‘హరీష్’ వ్యాఖ్యల కలకలం!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ఏమి జరుగుతోంది?. పైకి అంతా సవ్యంగా ఉన్నట్లు కన్పిస్తున్నా ‘లోలోపల’ మాత్రం ఏదో జరుగుతోంది అనే అనుమానాలు మాత్రం తలెత్తుతున్నాయి. ఈ మధ్య ఏ ఇంటర్వ్యూలో చూసినా మంత్రి హరీష్ రావుకు ఒకే ప్రశ్న ఎదురవుతోంది. కెటీఆర్ సీఎం అయితే ఆయన దగ్గర మంత్రిగా పనిచేయటానికి సిద్ధమా?. టీఆర్ఎస్ నిర్మాణంలో పాలుపంచుకున్న హరీష్ రావుకు ఇది ఇది సహజంగా ఒకింత ఇబ్బందికర పరిణామమే. అయితే ఆయన మాత్రం తనకు కెసీఆర్ ఆదేశాలే శాసనం అంటూ ప్రతి వేదిక మీదా చెబుతూ ఉన్నారు. అయినా హరీష్ రావుకు అవమానాలు తప్పటం లేదా?. ఎందుకు హరీష్ రావు శుక్రవారం నాడు ఇంత సంచలన వ్యాఖ్యలు చేశారు. వయస్సు పైబడిన నాయకులు కూడా అందరూ ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్న ఈ రోజుల్లో హరీష్ రావు ఏమంత పెద్ద వయస్సు' అయిపోయిందని ‘రాజకీయ నిష్క్రమణ’ వంటి వ్యాఖ్యలు చేయటం. దీని వెనక కారణం ఏంటి అన్నది టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం విస్తృత చర్చ నడుస్తోంది. సిద్ధిపేట సమీపంలో ఉన్న ఇబ్రహీంపూర్ సమావేశంలో మాట్లాడుతూ ‘ మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే ఇలా ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలి అన్పిస్తోంది. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేస్తూనే ఉంటా.

మీ ఆదరాభిమానాలు చూశాక ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నా చాలు అన్పిస్తోంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాబీ నబీ ఆజాద్ టీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తూనే..హరీష్ మరో వైపు ఇంత బేలగా ఎందుకు మాట్లాడారు? అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు..ప్రస్తుతం పూర్తి ‘పాజిటివ్’ మోడ్ లో ఉండే అధికారిక పత్రిక, ఛానల్ లో కూడా హరీష్ రావుకు ‘భారీ కత్తెర’ వేశారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మాత్రం టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే అనుమానాలు రేకెత్తిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం పీఠంపై కెటీఆర్ ను కూర్చోపెట్టి..కెసీఆర్ ఢిల్లీ వైపు వెళతారని ప్రచారంలో ఉంది. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన కొండా సురేఖ కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పారు.

Next Story
Share it