Telugu Gateway
Telangana

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్
X

ఎన్నికల వేడి మొదలైన తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకే తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరటానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. సురేష్ రెడ్డితో ఆయన నివాసంలో మంత్రి కెటీఆర్ చర్చలు జరిపారు. పార్టీలోకి వస్తే..సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇఛ్చినట్లు కెటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సర్కారు కొనసాగితేనే ప్రగతి సరిగా ముందుకు సాగుతుందని సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకే. 1989 నుంచి అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సురేశ్‌ రెడ్డిలు మంచి స్నేహితులని, ఇరువురు కలిసి శాసన సభలో పనిచేశారని, పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారని ఈ సందర్భంగా కెటీఆర్ గుర్తు చేశారు.

ముఖ్యంగా తెలంగాణ కోసం ఇద్దరికి ఒక భావసారుప్యత ఉండేదన్నారు. పార్టీలు, ఆలోచనలు వేరైనా ఇరువురు తెలంగాణ కోసం ఒకే భావనతో ఉన్నారని తెలిపారు. రాజకీయ లబ్ధికోసం టీఆర్‌ఎస్‌లో చేరడం లేదని సురేశ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా అయిపోయిందని, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రాభివృద్ధిలో భాగమయ్యేందుకు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి ఇంతే వేగంగా కొనసాగిల్సిన అవసరం ఉందన్నారు. దీంతోనే పార్టీలో చేరి ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వేగంగా నడిపే కారులో డ్రైవర్‌ను మారిస్తే ఎలా ఇబ్బంది కలుగుతుందో.. ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కూడా అలానే ఉందన్నారు. సీఎంగా కేసీఆర్‌ కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story
Share it