Telugu Gateway
Movie reviews

‘దేవదాసు’ మూవీ రివ్యూ

‘దేవదాసు’ మూవీ రివ్యూ
X

సీనియర్ హీరో నాగార్జున. యువ హీరో నాని. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి సహజం. అందునా వైజయంతీ మూవీస్ వంటి బడా సంస్థ సారధ్యంలో తెరకెక్కిన సినిమా. నాగార్జున తాజా సినిమా ‘ఆఫీసర్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నాని తాజా సినిమా ‘కష్ణార్జున యుద్ధం’ పరిస్థితి కూడా అంతే. వరస హిట్స్ అందుకుంటున్న ఈ హీరోకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసిందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో వచ్చిన దేవదాస్ సినిమా ఇద్దరికీ కీలకంగా మారింది. దేవదాస్ సినిమాలో దేవాగా నాగార్జున ఓ మాఫియా డాన్ గా, దాస్ గా నాని డాక్టర్ గా యాక్ట్ చేశారు. పదేళ్ల పాటు ఎక్కడా కన్పించకుండా దేవా మాఫియాను నడిపిస్తుంటాడు. తన పెంపుడు తండ్రి శరత్ కుమార్ హత్యతో ‘దేవ’ బయటకు వస్తాడు. ఎలాగైనా దేవాను పట్టుకోవాలనే లక్ష్యంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఓ ఘటనలో బుల్లెట్ గాయాలతో దేవా డాక్టర్ దాస్ నడిపే ఓ చిన్న ఆస్పత్రికి వెళతాడు. అక్కడ నుంచే వీరిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది.

డాక్టర్ గా గోల్డ్ మెడల్ సాధించిన దాస్ ఎన్నో కలలతో ఓ ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రిలో చేరతాడు. ఫస్ట్ ఉద్యోగం ఏకంగా ‘మార్చురి’లో వేయటంతో దాస్ చిక్కుల్లో పడతాడు. ఓ రోజు అదే ఆస్పత్రిలో ఐసీయూ విభాగం ఇన్ ఛార్జి పని మీద బయటకు వెళుతూ ఆ బాధ్యతలు దాస్ కు అప్పగించి వెళతారు. ఆ సమయంలో ఐసీయూలోని పేషంట్ కు సీనియర్ డాక్టర్ అనుమతి లేకుండా దాస్ సొంత వైద్యం చేసి పేషంట్ ను కాపాడతాడు. ఇది తెలిసిన ఆస్పత్రి ఇన్ ఛార్జి రావు రమేష్ సీరియస్ అయి దాస్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత ఓ బస్తీలో ఉండే ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూ ఉంటాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాఫియా డాన్ పాత్రలో ‘దేవ’ క్యారెక్టర్ లో నాగార్జునను శక్తివంతంగా చూపించలేకపోయారు.

దాస్ పాత్రలో డాక్టర్ గా నాని నవ్వులు పూయించారు. ఆయన పాత్ర కూడా వెరైటీగా తీర్చిదిద్దారు దర్శకుడు. దేవ క్యారెక్టర్ చాలా పేలవంగా ఉంది. నాగార్జున, ఆంకాక్ష సింగ్ ల లవ్ ట్రాక్, నాని, రష్మిక మందనల లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. సినిమాలో పాటలు ఓకే. వైద్యం అందించి ప్రాణాలు కాపాడే దాస్...మాఫియా డాన్ గా ఉన్న దేవాను మార్చే క్రమంలో వచ్చిన సెంటిమెంట్ సీన్లు కొన్ని ఆకట్టుకుంటాయి. ఇతర పాత్రల్లో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, నరేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్ గా చూస్తే ‘దేవదాస్’ ఓ టైమ్ పాస్ సినిమా.

రేటింగ్. 2.75/5

Next Story
Share it