Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు రియల్ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ గా సీఆర్ డీఏ

చంద్రబాబు రియల్ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ గా సీఆర్ డీఏ
X

ఏడు ఎకరాల్లో వాణిజ్య మాల్..ఎంటర్ టైన్ మెంట్ సెంటర్ కు టెండర్

అమరావతిలో ఏడు ఎకరాలు. అరవై సంవత్సరాల పాటు లీజు. అందులో ఏర్పాటు అయ్యేది వాణిజ్య మాల్. అంతే కాకుండా ఎంటర్ టైన్ మెంట్ సెంటర్. ప్రభుత్వం పాలించటానికి ఉందా?. లేక పక్కా వ్యాపారవేత్తల మాదిరి మాల్స్ కట్టి...ఎంటర్ టైన్ మెంట్ సిటీలు కట్టి వ్యాపారం చేయటానికి ఉందా?. ఎవరో అంతర్జాతీయ/జాతీయ సంస్థలకు ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేట్లు అయితే...రైతుల దగ్గర ఏకంగా మూడు పంటలు పండే 33 వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా?. అమరావతిలో వరస పెట్టి జరుగుతున్న భూ కేటాయింపులు చూస్తుంటే రాజధాని పేరు చెప్పి చంద్రబాబునాయుడు చేస్తున్న అక్రమ దందాలు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మెగా మాల్స్ కు అమరావతిలో చేస్తున్న భూ కేటాయింపులు చూస్తుంటే చంద్రబాబు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అర్థం అవుతూనే ఉంది. అంటే బడాబడా పారిశ్రామికవేత్తలకు ఏ మాత్రం నొప్పితగలకుండా రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను రాయితీ రేట్లతో కారుచౌకగా కట్టబెట్టి తద్వారా ప్రయోజనం పొందాలన్నది ఆయన ప్లాన్ అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అందుకే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎపీసీఆర్ డీఏ)ను తన సొంత సంస్థ అంటే..చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ ఆథారిటీగా మార్చేశారు. ఇప్పుడు అక్కడ అసలు రాజధాని పనుల కంటే వాణిజ్యభవనాలు, మల్టీఫ్లెక్స్ లు, కన్వెన్షన్ సెంటర్లు, రియల్ ఎస్టేట్, స్టార్ హోటళ్ళకు భూ కేటాయింపుల పనులే వేగంగా జరుగుతున్నాయి. రాజధాని పేరు చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఆ భూములను అడ్డంగా బడాబడా కార్పొరేట్ సంస్థలు, అస్మదీయ సంస్థలకు కట్టబెట్టి చంద్రబాబు అండ్ కో కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశంలో పేరెన్నికగన్న రియల్ ఎస్టేట్ సంస్థలకు అచ్చం హైదరాబాద్ లో ఐటి పేరు చెప్పి ఎలా స్కామ్ లకు తెరలేపారో ఇప్పుడు అచ్చం అమరావతిలోనూ అదే మోడల్ ను ఫాలో అవ్వబోతున్నారు. అమరావతిలో ఎలాగూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్కామ్ లన్నింటిని తలదన్నే ‘స్విస్ ఛాలెంజ్’ మోసం ఉండనే ఉంది. ఇది చాలదన్నట్లు అమరావతిలో ‘వాణిజ్య’ దందా కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లోనూ అస్మదీయ సంస్థలకు భారీ ఎత్తున భూ కేటాయింపులు చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని చెబుతున్నారు.

Next Story
Share it