Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశం..అనుమానాలు

చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశం..అనుమానాలు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతి విదేశీ పర్యటన వివాదస్పదం అవుతూనే ఉంది. ఎందుకంటే అందులో ఎన్నో మతలబులు ఉంటున్నాయి మరి. తాజాగా చంద్రబాబు అమెరికా పర్యటన కూడా ప్రజల్లో ఎన్నో అనుమానాలు లేవనెత్తుతోంది. చూస్తుంటే ఇది కూడా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంగానే కన్పిస్తోంది. దీని వెనక అన్ని బలమైన కారణాలు ఉన్నాయి మరి. ఉమ్మడి రాష్ట్రంలో కొంత మంది విలేకరులు కూడా అలాగే చేసేవారు. ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయంలోని ‘సీ బ్లాక్’లో ఉండేది. కిందే ముఖ్యమంత్రి మీడియా వ్యవహారాల ముఖ్య పీఆర్ వో కార్యాలయం ఉంటుంది. కొంత మంది ఔత్సాహిక జర్నలిస్టులను ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే..సీఎం ఆఫీసులో అని చెప్పుకునేవారు. సాంకేతికంగా చూస్తే అది సీఎం ఆఫీసే. కానీ సీఎం ఉండే ఫ్లోర్ వేరు..వీళ్లు ఉండే ఫ్లోర్ వేరు. అదీ లెక్క. ఇప్పుడు చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశం కూడా అదే తరహాలో ఉంది. ఐక్యరాజ్యసమితి భవన ప్రాంగణంలో సమావేశం జరిగితే అది ఐక్యరాజ్యసమితి సమావేశం అయిపోతుందా? అని ఓ అధికారి ప్రశ్నించారు. చంద్రబాబు డబ్బులు పెట్టి కొనుగోలు చేసే వెళ్ళే వరల్డ్ ఎకనమిక్ పోరం దావోస్ సభలకు పోతే ఈ వేదిక వెనక పెద్ద పెద్ద లోగోలతో పాటు...సభ..సమావేశం వివరాలు ఉంటాయి.

కానీ చంద్రబాబు చెబుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశ వేదిక బ్యాగ్రౌండ్ లో అసలు అది ఏ మీటింగ్..దాని ఉద్దేశం ఏమిటి అన్నది ఏమీ లేదు. పోనీ వాళ్ల దగ్గర డబ్బుల్లేక పోతే విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చుపెట్టే చంద్రబాబే ఆ ఫ్లెక్సీల ఖర్చు కూడా భరించే వారు కదా?. ఎందుకంత సాదాసీదాగా ఈ సమావేశం సాగింది? అన్నది ఓ ప్రశ్న. ఇంకో ప్రధాన అంశం ప్రకృతి సేద్యానికి భారత్ లో చంద్రబాబును ఓ మోడల్ గా గుర్తించారు అనుకుందాం?. దానిపై ఉపన్యాసం ఇవ్వటానికి పిలిస్తే..ఆ విమాన ఖర్చులు..అతిధి వరకూ బస సౌకర్యం కూడా నిర్వాహకులే చూసుకోవాలి. కానీ ప్రభుత్వం ఎందుకు జీవో జారీ చేసి ఖర్చు అంతా ఏపీఈడీబీ భరిస్తుందని జీవోలో పేర్కొన్నారు? దీంతోనే ప్రజల్లో..పార్టీల్లో చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల పర్యటనలు అన్నీ ‘ఏర్పాటు చేసుకున్నవే’ తప్ప..ఆహ్వానాలు వచ్చి పిలిచినవి కావు అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it