Telugu Gateway
Andhra Pradesh

అవకాశవాదం c\o చంద్రబాబు

అవకాశవాదం c\o చంద్రబాబు
X

యూటర్న్ లకు..అవకాశవాదానికి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా? అంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఎక్కువ శాతం అవకాశవాదులే కావొచ్చు. కానీ అందరితో పోలిస్తే చంద్రబాబు అవకాశవాద పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎవరితో అయినా కలవొచ్చు. ఆ పార్టీ రాజకీయాలకు ప్రజలు అలా అలవాటు పడిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ పుట్టిందే కరడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకతతో. కానీ ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏకంగా కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పై ఏమి విమర్శలు చేశారో మచ్చుకు కొన్ని...‘కాంగ్రెస్ ను చంపాలి’. సోనియా అవినీతి అనకొండ. ఒట్టేసి చెబుతున్నా..కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తా. సోనియాది విదేశీ పాలనే. స్వాతంత్రం రావాలంటే కాంగ్రెస్ ను సాగనంపాలి. కాంగ్రెస్ దేశానికి శని. సోనియా ఓ మాఫియా. కాంగ్రెస్ అసలు ఓ పార్టీనా?.’ ఇవీ నిప్పు నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటారు?.

గతంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పా?. లేక అవి నిజమే అయితే పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారో ప్రజలకు అయినా సమాధానం చెబుతారా?. అంటే అవసరాన్ని బట్టి మాటలు మారిపోతాయా?. ఒకప్పుడు గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మోడీ పదవి నుంచి దిగిపోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ కథ కంచికి చేరింది. తర్వాత అదే మోడీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ పై అయితే లెక్కలేనన్ని విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అవుతున్నారు. టీడీపీ మూల సిద్దాంతాలను విస్మరించి మరీ చంద్రబాబు ఈ పని చేయబోతున్నారు. ఇన్ని చూసిన తర్వాత కూడా చంద్రబాబు అవకాశవాదానికి కేరాఫ్ అడ్రస్ కాదంటే ఎవరైనా నమ్ముతారా?.

Next Story
Share it