Telugu Gateway
Telangana

మెట్రో యాడ్ లో ‘దత్తన్న’కు దక్కని చోటు..బిజెపి సీరియస్

మెట్రో యాడ్ లో ‘దత్తన్న’కు దక్కని చోటు..బిజెపి సీరియస్
X

హైదరాబాద్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెట్రో రైలు’ అమీర్ పేట-ఎల్బీనగర్ కారిడార్ సోమవారం నాడు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రధాన పత్రికల్లో తెలంగాణ సర్కరు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ తోపాటు నగర మంత్రులు, మేయర్ ఫోటోకు ఆ ప్రకటనలో చోటు కల్పించారు కానీ..సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కు మాత్రం చోటు కల్పించలేదు. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు అయింది కానీ..పార్లమెంట్ అలాగే ఉంది. అయినా సరే దత్తాత్రేయను విస్మరించటంపై బిజెపి గరం గరంగా ఉంది. అంతే కాదు. దీని వెనక ఉన్న కారణంపై ఆ పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం వయబులిటి గ్యాఫ్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద సాయం కూడా అందిస్తుంది. పోనీ కేంద్ర మంత్రిని విస్మరించారు అనుకుంటే కొంతలో కొంత ఓకే. కానీ స్థానిక ఎంపీ దత్తాత్రేయను అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు యాడ్ లో విస్మరించటం ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు. అధికారులు సిట్టింగ్ ఎంపీని ఎలా విస్మరిస్తారనే అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ కారిడార్ ప్రారంభోత్సవం జరగనున్నది కూడా అమీర్ పేటలోనే కావటం విశేషం. గవర్నర్ నరసింహన్ తీరుపైన కూడా బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు. తప్పు చేసిన అధికారులపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story
Share it