Telugu Gateway
Andhra Pradesh

బిజెపితో కుమ్మక్కు అయితే ఇలా జరుగుతుందా?.

బిజెపితో కుమ్మక్కు అయితే ఇలా జరుగుతుందా?.
X

ఇదీ ఏపీ ప్రతిపక్ష నేత, వైసీసీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. భారతి సిమెంట్స్ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వైఎస్ భారతి పేరును ఛార్జిషీట్ లో పెట్టినట్లు వచ్చిన వార్తలపై జగన్ స్పందించారు. ఈ మేరకు ఏపీ ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తాజా పరిణామాలు చూస్తే అయినా...ఎవరు ఎవరితో కుమ్మక్కు అయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో ప్రజలు తెలుసుకోగలరని అన్నారు. జగన్ లేఖలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....‘ ‘ఈడీ కేసులో నిందితురాలిగా వైఎస్‌ భారతి’ అంటూ ఈనాడులో, ‘ముద్దాయిగా భారతి’ అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ నెల 10వ తేదీన ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. తనను ఫలానా కేసులో ఈడీ అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న విషయాన్ని భారతి, నేను ఎల్లో పత్రికలు, సెలెక్టివ్‌గా ఒకటి రెండు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్న తరవాతే చార్జిషీట్‌లో ఏముందన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోక ముందే... మాకే తెలియకుండా, ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు?

మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? నా మీదే కాకుండా మొత్తంగా నా కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికుంది? సీబీఐ తన విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తులను ఇన్నేళ్ల తరవాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారు? అసలు భారతికి ఈ కేసులతో సంబంధమేంటి? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతూ, కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజల ముందుంచేందుకు నేను ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. నామీద తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి వేసిన కేసులు 2011 ఆగస్టు 10న ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటికీ ఏడేళ్లయింది. ఎన్నో చార్జిషీట్లు వేశారు. అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. మహానేత మరణం తరవాత మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తానన్నందుకు, పెద్ద ఎత్తున ప్రజాదరణ దక్కుతున్నందుకు తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కై నా మీద కేసులు వేశాయి. ఏడేళ్లుగా ఏటికి ఎదురీదుతున్నా. ఏనాడూ భయపడలేదు. ఈడీలో చంద్రబాబు కోసం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న ఇద్దరు అధికారులున్నారు. వాళ్లు ఉమాశంకర్‌ గౌడ్, గాంధీ. ఈ ఇద్దరూ మమ్మల్ని ఏ స్థాయిలో వేధిస్తున్నారో 2017 ఫిబ్రవరిలో, అంటే దాదాపు 17 నెలల క్రితం భారత ప్రధానమంత్రికి లేఖ ద్వారా తెలియజేశాం.

ఆ అధికారుల కాల్‌డేటాపై దర్యాప్తు చేసినా, వారికి చంద్రబాబుగారి సహచరులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేసినా... ఆ ఇద్దరూ నా మీద, నా కుటుంబం మీద చంద్రబాబు ప్రయోగించిన ప్రత్యేక ఆయుధాలన్న విషయం రూఢీ అవుతుంది. ఇందులో గాంధీ అనే అధికారి బదిలీ అయినా, ఉద్యోగం నుంచి రిలీవ్‌ కాకుండా అసాధారణంగా ఆయన మూడుసార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఈ పొడిగింపును కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఇప్పుడు ఆ అధికారుల చేతే టీడీపీ వారు మాపై కక్ష సాధింపు రిపోర్టులు రాయించారని స్పష్టమవుతోంది. ఇవన్నీ గమనించిన తరవాత... బీజేపీతో కుమ్మక్కు అయింది ఎవరు? బీజేపీ, టీడీపీల చీకటి వ్యవహారాల్లో బాధితులెవరన్నది రాష్ట్ర ప్రజలకు మరింతగా స్పష్టమవుతుంది. చంద్రబాబూ... మీరు బురద జల్లుతున్న దాంట్లో వాస్తవం ఏమిటి? ఇందులో వాస్తవమే ఉంటే, అంటే బీజేపీకి, మాకూ అంత సత్సంబంధాలే ఉంటే, ఈ విషయం ఇంతదూరం వచ్చేదా? అసలు ఈ కేసులతో ఏ సంబంధమూ లేని నా భార్యను కూడా కక్షపూరితంగా, అదీ ఏడేళ్ల తరవాత ఈడీ వారు చార్జిషీట్‌లో పెట్టి ఉండేవారా? పగలు కాంగ్రెస్‌తో కాపురం, రాత్రికి బీజేపీతో సంసారం... ఇదీ ఇప్పుడు చంద్రబాబు నడుపుతున్న రాజకీయం. ఈ తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా, నాపై కేసుల విషయంలో భయపడకుండా, రాజీపడకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ పోరాటం నుంచి ప్రత్యేక హోదా పోరాటం వరకు ధైర్యంగా రాష్ట్ర సమస్యలపై ఉద్యమించాం తప్ప కాడి అవతల పారేయలేదు. లాలూచీ ఆలోచనలు చేయలేదు. తెర వెనుక రాజకీయాలు మాకు చేతగావు. ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేసి... ‘ప్రత్యర్థిపక్షాన్ని’ ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి అధికారంలో కొనసాగాలనుకుంటున్నాడు’ అని పేర్కొన్నారు.

Next Story
Share it