Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్..న్యాయ శాఖ కార్యదర్శికే ధిక్కార నోటీసులు

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్..న్యాయ శాఖ కార్యదర్శికే ధిక్కార నోటీసులు
X

తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శికే కోర్టు ధిక్కరణ నోటీసులు. అంతే కాదు..శాసన సభ కార్యదర్శికి కూడా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన అంశానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల సభ్వత్వం రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వటం..దీన్ని ప్రభుత్వం అమలు చేయకపోవటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. తమ ఆదేశాలు అమలు చేయనందున ఎందుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయకూడదో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓ దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల పునరుద్దరణకు చర్చలు జరుగుతున్నాయని హైకోర్టుకు చెప్పి..తర్వాత హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ చేశారు. అయితే ఈ అప్పీల్ ను సత్వరమే వినాల్సిన అవసరం లేదని తేల్చిన హైకోర్టు సీజె బెంచ్..కేసును ఈ నెల 16కి వాయిదా వేసింది.

అయితే తొలుత తీర్పు ఇచ్చిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ముందు ప్రకటించినట్లుగా ఫామ్ 1 నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా వచ్చే నెల 17న న్యాయ శాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శిని కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన వేతనాల వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ పరిణామం తెలంగాణ సర్కారును ఖచ్చితంగా ఇరకాటంలో పడేసేదే. ఏకపక్షంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయటమే కాకుండా..హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా సర్కారు జాప్యం చేస్తుండటంతో ఈ వివాదం రోజురోజుకు మరింత జఠిలంగా మారుతోంది. ఈ పరిణామాలతో అసలు కెసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోందని..ఎన్నికల సమయంలో ఇది తమకు ఏ మాత్రం మేలు చేయదని టీఆర్ఎస్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

Next Story
Share it