Telugu Gateway
Telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోనే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోనే!
X

లోక్ సభకు అసలు ముందస్తు ఎన్నికలు ఉంటాయా?. ఉంటే ఎన్ని రాష్ట్రాలకు వాటితో పాటు ఎన్నికలు వస్తాయి?. ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలకు తెలంగాణ సర్కారు సిద్ధమైపోతోంది. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వచ్చినా ఓకే..లేదంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళేందుకు సీఎం కెసీఆర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ దిశగానే ఆయన వేగంగా ముందుకు కదులుతున్నారు. శనివారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కెసీఆర్ ల మధ్య ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అసెంబ్లీని రద్దు చేసి...రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఎన్నికలకు పోవాలంటే ఓ రకంగా కేంద్ర సహకారం కూడా అవసరం. ఈ అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోడీ సర్కారు తెరపైకి తెచ్చిన జిమిలి ఎన్నికలకు కెసీఆర్ జై కొడుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లేదా జనవరిలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందనే సమాచారం కీలక మంత్రులకు కూడా చేరింది. ముఖ్యంగా కెసీఆర్ ముందస్తు ఎన్నికల వైపు మొగ్గుచూపటానికి పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు.

అందులో ప్రధానమైనది..టీఆర్ఎస్ కు రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికలకు గేర్ అప్ కాలేదు. దీనికి తోడు నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కూడా అదే స్ధాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ లో కీలకమైన పదవుల పంపకం పూర్తి అయి..వాళ్ళు రోడ్డెక్కి రాష్ట్రం అంతా తిరిగి వచ్చేస్తే ఎంతో కొంత నష్టం ఉంటుందని కెసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సిద్ధం కాకముందే తాను అంతా రంగం సిద్ధం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చేలా ప్లాన్స్ వేసుకుంటున్నారు ఈ గులాబీ పార్టీ అధినేత. కాంగ్రెస్ నేతలు తాము ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అని ప్రకటనలు చేస్తున్నా..ఆ సన్నద్ధం పార్టీలో కన్పించటం లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఉంది. చూడాలి మరి కెసీఆర్ ‘ముందస్తు ప్లాన్స్’ ఏ మేరకు ఫలిస్తాయో!

Next Story
Share it