Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో ‘కాంగ్రెస్’ కలకలం

టీడీపీలో ‘కాంగ్రెస్’ కలకలం
X

ఆంధ్ర్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త రగడ మొదలైంది. ఓ వైపు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అవుతుంటే..ఆ పార్టీ సీనియర్లు మాత్రం ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలైన ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి, మంత్రి అయ్యన్నపాత్రుడు కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ వైపు చంద్రబాబు పొత్తుకు అంగీకరించకపోవచ్చని అంటూనే...కాంగ్రెస్ తో పొత్తు ఉంటే అంతకు మించిన ఖర్మ మరొకటి ఉండదని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. దేశాన్ని..రాష్ట్రాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో అని...అలాంటిది పొత్తు ఎలా పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పొత్తు అంటే బట్టలూడదీసి కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు టీడీపీలో పెద్ద దుమారమే రేపాయి.

కె ఈ కృష్ణమూర్తి కూడా అయ్యన్నపాత్రుడి స్థాయిలో కాకపోయినా కాంగ్రెస్ తో పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతికేరిస్తున్నారు. దీనిపై ఆయన కూడా బహిరంగంగానే మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్, వైసీపీ, జనసేనలు అన్నీ తమకు శత్రువులే అని కె ఈ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని తాను అనుకోవటం లేదని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు మాత్రం ‘బిజెపి’ వ్యతిరేకత అంశాన్ని చూపిస్తూ..కాంగ్రెస్ కు దగ్గరయ్యేందు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ‘కాంగ్రెస్ వ్యతిరేకత’కు కాలం చెల్లిందనే వాదన తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప..మిగతా విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోరనే పేరుంది. ఎంత మంది వ్యతిరేకించినా సరే..ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుని తీరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద పొత్తుల వ్యవహారం టీడీపీలో చిచ్చురేపటం ఖాయంగా కన్పిస్తోంది. మరి చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it