Telugu Gateway
Andhra Pradesh

శ్రీశైలానికి పర్యాటక కళ

శ్రీశైలానికి పర్యాటక కళ
X

శ్రీశైలం జలాశయం ఇప్పుడు నిండు కుండలా తొణికసలాడుతోంది. అందులో వారాంతం రోజులు. నాలుగు గేట్లు ఎత్తేశారు. పర్యాటక ప్రేమికులకు అంత కంటే ఏమి కావాలి. ఇప్పుడు అంతా ఛలో శ్రీశైలం అంటూ బయలుదేరుతున్నారు. హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలం బాట పడుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. దీంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి ఆసక్తి చూపుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు అయితే...ప్రస్తుతం నీరు 881 అడుగుల వద్ద ఉంది.

దీంతో శనివారం ఉదయమే నాలుగు గేట్లను ఎత్తేశారు. పై నుంచి వచ్చే నీటి ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం గేట్టు ఎత్తేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గేట్లు అన్నీ ఎత్తిన సమయంలో శ్రీశైలం డ్యామ్ ను చూడటం ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఆ సమయం కోసం చాలా మంది వేచిచూస్తూ ఉంటారు కూడా. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో అయినా శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం గేట్లు తెరుచుకోవటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it