Telugu Gateway
Movie reviews

‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ రివ్యూ

‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ రివ్యూ
X

‘ఈ ప్రపంచం మనుషుల కంటే కాయితాలను నమ్మటం ఎప్పుడో ప్రారంభం అయింది. మనం పుట్టినప్పుడు అందరూ సంతోషిస్తారు. చనిపోయినప్పుడు అందరూ బాధపడతారు. కానీ ఇవేమీ మనకు తెలియదు. మనకు తెలిసి అందరూ సంతోషంగా..పండగగా చేసుకునేది పెళ్లి మాత్రమే. మంచితనంతో ఉంటే డబ్బులు సంపాదించలేకపోవచ్చు. కానీ మన అనుకునే వాళ్లను మాత్రం సంపాదించుకోవచ్చు. పెళ్లి అంటే ఈవెంట్ మేనేజె మెంట్ కాదు. ఇవో అద్భుతమైన క్షణాలు.’ ఇలా పెళ్లి ప్రాముఖ్యత..ప్రాధాన్యతలను ఈ తరానికి తెలియజెప్పే సినిమానే శ్రీనివాస కళ్యాణం. హీరో నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన ఈ సినిమా గురువారం నాడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా దర్శకుడు శతమానం భవతి వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ను తెరకెక్కించిన సతీష్ వెగ్నేశ కావటంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ తరం యువతకు పెళ్లి ప్రాముఖ్యతను..అమ్మాయి తరపు తల్లిదండ్రులు...అబ్బాయి తరపు వాళ్ళు చేయాల్సిన పనులు ఎన్ని ఉంటాయి..ఎలా ఉంటాయి అన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ఇప్పుడు ముఖ్యంగా నగరాలు..పట్టణాల్లో పెళ్ళిళ్ళు అంటే అంతా ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలదే హడావుడి. పెళ్లి సమయానికి పెళ్లి కూతురు..పెళ్ళి కొడుకు వస్తే చాలు అనే పరిస్థితులు వచ్చాయి. అలాగే ఎంతో బిజీగా ఉండే పారిశ్రామికవేత్తగా ..రాశీ ఖన్నా తండ్రిగా ప్రకాష్ రాజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. గ్రామీణ వాతావరణంలో పుట్టిపెరిగిన యువకుడిగా..నితిన్ తన పాత్రలో జీవించాడు. నితిన్ మరదలుగా ఈ సినిమాలో నందితా శ్వేత సందడి చేస్తుంది. క్లైమాక్స్ లో ఉంచే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. రాజేంద్రప్రసాద్, జయసుధ, నరేష్, సితార ఇలా అందరూ తమ పరిధుల మేర పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా చూస్తే శ్రీనివాస కళ్యాణం కంప్లీట్ ఫ్యామిలీ సినిమా.

రేటింగ్. 3.25/5

Next Story
Share it