Telugu Gateway
Top Stories

సిద్ధూ ‘కౌగిలింత కలకలం’

సిద్ధూ ‘కౌగిలింత కలకలం’
X

కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కౌగిలింత వ్యవహారం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సాక్ష్యాత్తూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరేంద్రసింగ్ కూడా సిద్ధూ చర్యను వ్యతిరేకించారు. ఓ వైపు బిజెపి ఈ విషయంలో కాంగ్రెస్ పై విమర్శల దాడి చేస్తోంది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరైన సిద్ధూ అక్కడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకోవటం దేశంలో పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కూడా సిద్ధూ చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. సిద్ధూ నీకు దేశం ముఖ్యమా?. స్నేహం ముఖ్యమా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ విమర్శలపై సిద్ధూ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తనపై వస్తున్న విమర్శలకు సిద్ధూ సమాధానం ఇదే. ‘మనం ఒక ప్రదేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్తే.. వారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం. నేను మొదటగా దూరంగా కూర్చున్నా. కానీ వారు నన్ను స్టేజీపైకి రమ్మని తొలివరుసలో కూర్చోమన్నారు. అందుకే వెళ్లాను. అందులో తప్పేం ఉందని సిద్ధూ వ్యాఖ్యానించారు.

పాక్‌ ఆర్మీ చీఫ్‌ను కౌగిలంచుకోవడంపై స్పందిస్తూ.. ‘అతనే నా ముందుకు వచ్చి ఒకప్పుడు క్రికెటర్ కావాలని అనుకున్నట్లు చెప్పారు. అంతే కాదుసిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది’ అని పేర్కొన్నారు. ఓ వైపు నిత్యం దేశ సైనికులు పాకిస్తాన్ పై పోరాటంలో మరణిస్తుంటే..సిద్దూ ఆ దేశ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకోవటం ఏ మాత్రం సరికాదని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

Next Story
Share it