Telugu Gateway
Politics

నల్లధనం అంతా తెల్లగా మారిందా!

నల్లధనం అంతా తెల్లగా మారిందా!
X

దేశ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐఐ) నివేదిక మరో సారి తేల్చిచెప్పింది. ప్రధాని మోడీ మాటలను చాలా మంది మధ్య తరగతి ప్రజలు నమ్మారు. భావోద్వేగంతో పెద్ద నోట్ల రద్దును సమర్థించారు. కానీ కాలం గడిచే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వచ్చేసరికి అసలు విషయం బహిర్గతం అయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల పెద్దగా ప్రయోజనం ఒనగూరలేదని తేలిపోయింది. దీంతో దేశంలోని నల్లధనం అంతా చట్టబద్ద తెల్లదనంగా మారిపోయినట్లు అయింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా సర్కారు ఎన్నో ప్రయోజనాలు ఆశించింది. కానీ అవేమీ నెరవేరినట్లు కన్పించలేదు కదా...కొత్త నోట్ల రద్దు కు అయిన వ్యయం కూడా భారంగానే మారిందని ఆర్ బిఐ తాజా నివేదిక వెల్లడించింది. రద్దయిన పెద్ద నోట్లలో 99.3 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగొచ్చాయని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ ఇప్పుడు ఓ అవకాశంగా మలుచుకుని కేంద్రంపై విమర్శలకు దిగింది. డీమోనిటైజేషన్‌ కోసం దేశం ఎంతో మూల్యం చెల్లించిందని, ప్రధాని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేసింది. రూ.3 లక్షల కోట్ల మేర అక్రమ నగదు వ్యవస్థలోకి వస్తుందని 2017 స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారని, అబద్ధం చెప్పినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు.

సరైన లెక్కలు లేకుండా మోదీ సృష్టించిన విపత్తు డీమోనిటైజేషన్‌ అని ఆర్‌బీఐ నివేదిక మరోసారి నిరూపించిందన్నారు. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం కూడా దీనిపై స్పందించారు. డీమోనిటైజేషన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, పరిశ్రమల మూతపడటం, వృద్ధి రేటు తగ్గడం వంటి సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొందని చిదంబరం అన్నారు. వృద్ధి రేటు పరంగా దేశ జీడీపీ 1.5 శాతం మేర నష్టపోయింది. దీనివల్లే రూ.2.25 లక్షల కోట్ల నష్టం జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 కోట్ల మంది రోజువారీ వేతన జీవులు కొన్ని వారాల పాటు తమ ఉపాధి కోల్పోయారు. వేలాది ఎస్‌ఎంఈ యూనిట్లు మూతపడ్డాయని చిదంబరం ట్వీట్‌ చేశారు. ఆర్ బిఐ నివేదిక బిజెపిని ఇరకాటంలో పడేయటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it