Telugu Gateway
Telangana

పెద్ద నోట్ల రద్దు...బ్యాంకులో ‘ప్రజా శక్తి’ డిపాజిట్లు 127.71 కోట్లు

పెద్ద నోట్ల రద్దు...బ్యాంకులో ‘ప్రజా శక్తి’ డిపాజిట్లు 127.71 కోట్లు
X

పెద్ద నోట్ల రద్దును కమ్యూనిస్టులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకు పైకి కన్పించే..అందరికీ చెప్పే కారణం పేదలు, మధ్య తరగతి ప్రజల కష్టాలు అయితే...అసలు కారణం వేరేలా ఉన్నట్లు ఉంది. ఎందుకంటే ఏకంగా కమ్యూనిస్టలుకు చెందిన ఓ పత్రిక పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులో ఏకంగా 127.71 కోట్ల రూపాయల నగదును డిపాజిట్ చేసింది. అంతే కాదు..డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే అసాధారణ రీతిలో అంతే మొత్తాలను ఉపసంహరింపచేసుకున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వంద కోట్ల రూపాయలపైన డిపాజిట్లు చేసిన వారి వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్యాంకుల నుంచి సేకరించింది. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాశక్తి పబ్లిషర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. సహజంగా ‘ప్రజాశక్తి’ అంటే కమ్యూనిస్టుల పత్రిక. ఇది శ్రామిక..కార్మికుల పక్షాన నిలబడుతుంది అని అంతా నమ్ముతారు. కానీ బడా బడా కార్పొరేట్ సంస్థల వద్ద కూడా ఉండని స్థాయిలో ఏకంగా ఈ సంస్థ వద్ద 127.71 కోట్ల రూపాయల నగదు ఉండటంతో హైదరాబాద్ లోని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ వోసీ) అధికారులు కూడా విస్తుపోతున్నారు.

బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం జాబితాను సిద్ధం చేసిన కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఈ ఖాతాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఇలా వందల కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన సంస్థలకు చెందిన ఖాతాల తనిఖీలు ఎప్పుడో ప్రారంభించారు. కంపెనీల చట్టం, 2013 లోని సెక్షన్ 210(1) సీ ప్రకారం ఈ విచారణ సాగిస్తున్నారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అధికారులు ఈ విచారణ పనిలో ఉన్నారు. భారీ ఎత్తున కంపెనీలు...సంస్థలు, వ్యక్తుల మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయా?. అంతిమ లబ్దిదారులు ఎవరు? ఇందులో ఏమైనా కార్పొరేట్ మోసాలు ఉన్నాయా?. నిధులను సర్దుబాటు చేసుకున్నారా? వంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు.

అవసరాన్ని బట్టి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయనుంది. అయితే ఆయా కంపెనీల స్థిర, చర ఆస్తుల అమ్మకాలపై ఆంక్షలు కూడా విధించేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ప్రజాశక్తి విషయానికి వస్తే ఆ సంస్థ ఇంత భారీ మొత్తంలో ఎలా నగదు ఎందుకు డిపాజిట్ చేసింది?. మళ్ళీ వెంటనే ఉపసంహరించుకోవటానికి గల కారణాలు విచారణ సంస్థలకు ఏమి చెప్పింది అనే విషయం తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగుచూసిన జాబితాలో ఆ సంస్థ పేరు ఉంది.

Next Story
Share it