Telugu Gateway
Andhra Pradesh

ఒక్క కేసు ‘ఏపీ రాజకీయాన్ని మార్చేస్తుందా’!?

ఒక్క కేసు ‘ఏపీ రాజకీయాన్ని మార్చేస్తుందా’!?
X

‘కేంద్రంలోని బిజెపితో కుమ్మక్కు అయి జగన్ ఏపీకి అన్యాయం చేస్తున్నారు. జగన్ అండ చూసుకునే ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వాన్ని ..టీడీపీని టార్గెట్ చేస్తున్నారు.’ మోడీ..జగన్ మిలాఖత్ కు ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలి?.ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని మంత్రులు...ఎమ్మెల్యేలు అందరూ ఒకటే మాట...ఒకటే బాట అంటూ ఇవే మాటలను వల్లెవేస్తారు ఎక్కడైనా?. కానీ అకస్మాత్తుగా సీన్ రివర్స్ అయింది. సడన్ గా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ లో వైఎస్ భారతి పేరును చేర్చటంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఏడేళ్ల తర్వాత సీబీఐ ఛార్జిషీట్ లో ఎక్కడా భారతి పేరు చేర్చకపోయినా..సడన్ గా ఈడీ ఛార్జిషీట్ లో ఆమె పేరు ఉండటంతో రాజకీయంగా కలకలం రేగింది. ఇదే అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ పేరుతో పలు అంశాలను లేవనెత్తారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటి నుంచి ఏపీలో భారీ ఎత్తున సాగుతున్న అవినీతి కార్యకలాపాలకు సంబంధించి కేంద్రం కేసులు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కొంత మంది ఐఏఎస్ లతో పాటు..మంత్రుల పేర్లు కూడా విన్పించాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుమార్లు కేంద్రం తనను వేధించే అవకాశం ఉందని..ప్రజలంతా తనకు రక్షణ కవచంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కేసులు పెట్టే అవకాశం ఉందని చంద్రబాబు స్వయంగా బహిరంగ సభల్లో ప్రస్తావించారు. ఏపీకి చెందిన బిజెపి నేతలు రాష్ట్రంలో అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

అవినీతికి పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఏపీలో ఇంత వరకూ ఒక్క అధికారిపై కానీ..మంత్రిపై కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు అయితే ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని..వదిలిపెట్టే ప్రశ్నేలేదని పదే పదే ప్రకటిస్తున్నారు. అమల్లో మాత్రం ఏమీ జరగటం లేదు. పైగా ఎప్పుడో ఏడేళ్ల క్రితం కేసులో వైఎస్ భారతిపై ఈడీ ఛార్జిషీట్ వేయటం రాజకీయంగా కొత్త చర్చను లేవదీసింది. ఈడీ ఛార్జిషీటులో నిజా, నిజాలు ఏంటో కోర్టుల్లోనే తేలాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వ అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని బిజెపి నేతలు చెబుతున్నా ఒక్క కేసు కూడా దాఖలు కాదు. కానీ ఏడేళ్ల నాటి పాత కేసులపై ఇప్పుడు ఛార్జిషీట్లు..కొత్త వ్యక్తుల పేర్ల జోడింపు. జగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆ కేసులు అన్నీ నిగ్గుతేలాల్సింది కోర్టుల్లోనే. కానీ ప్రస్తుత ప్రభుత్వ అవినీతిని ఆధారాలు ఉన్నాయని చెబుతూ వదిలేయటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్ భారతి పేరు ఈడీ ఛార్జిషీట్ లో పెట్టడం రాజకీయంగా వైసీపీకి పెద్ద ‘అస్త్రం’గా మారినట్లు అయింది. చూడాలి ఈ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఓ వైపు అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడున్నా తమ మిత్రుడే అంటూ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలు తమకు లాభం చేస్తాయా? లేక నష్టం చేస్తాయా అన్న చర్చ టీడీపీ వర్గాల్లోనూ జరుగుతోంది.

Next Story
Share it