Telugu Gateway
Telangana

చిక్కుల్లో డీఎస్ తనయుడు

చిక్కుల్లో డీఎస్ తనయుడు
X

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ ఎస్ శ్రీనివాస్ తనయుడు సంజయ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తెలంగాణ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు పెట్టారు. ఈ మధ్యే నిజామాబాద్ కు చెందిన ఎంపీ కవితతోపాటు పార్టీ నేతలు అందరూ రాజ్యసభ సభ్యుడు డీఎస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని..ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసీఆర్ కు లేఖ రాశారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ లేఖపై కెసీఆర్ చర్య తీసుకోలేదు. డీఎస్ వచ్చి ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలవలేదు. ఈ వివాదం ఏమైందో తెలియదు కానీ..అంతా కామ్ గా మారిపోయారు. సడన్ గా ఇప్పుడు డీఎస్ తనయుడు తన నర్సింగ్ కాలేజీలోని విద్యార్ధులను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి..సంజయ్ పై నిర్భయ చట్టం కింద కేసు పెట్టారు. గతంలో ఓ సారి కూడా సంయజ్ పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినులు శుక్రవారం నిజామాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయకు ఫిర్యాదు చేయడంతో నాలుగో టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో సంజయ్‌పై 354, 354ఎ(నిర్భయ), 506, 509, 342 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

విద్యార్థినులను విచారించిన తరువాతే ఈ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్‌ ఏసీపీ సుదర్శన్‌ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్‌.. నిజామాబాద్‌లోని తన ఇళ్లకు తాళం వేసి పరారయ్యారు. పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి ఆయనను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ వ్యవహారంపై అంతకు ముందు సంజయ్ స్పందించారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, లైంగిక వేధింపుల ఆరోపణలు అందులో పేర్కొన్నారు. శాంకరి నర్సింగ్‌ కాలేజీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శాంకరి నర్సింగ్‌ కాలేజీని గత ఏడాదే ఇతరులకు లీజుకు ఇచ్చానని, ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. విద్యార్థినుల వెనుక ఎవరో ఉండి తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలూ బయటికొస్తాయన్నారు.

Next Story
Share it