Telugu Gateway
Movie reviews

‘నర్తనశాల’ మూవీ రివ్యూ

‘నర్తనశాల’ మూవీ రివ్యూ
X

ఓ అబ్బాయి...అమ్మాయి ప్రేమించుకోవటం సహజం. కానీ ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటే?. ఆ విషయం ఇద్దరి ఇళ్ళలో తెలిస్తే ఎలా ఉంటుంది?. అదే ‘నర్తనశాల’ సినిమాలో వింత. ఈ సినిమా ప్రమోషన్లలోనూ నాగశౌర్య తేడాగా ప్రవర్తించే సీన్లను వాడేశారు. ఓ వైపు ‘ఛలో’ వంటి విజయవంతమైన చిత్రాన్ని దక్కించుకున్న నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమాలో చేయటం ద్వారా తనకు తానే పరీక్ష పెట్టుకున్నారు. పోనీ ఆ పాత్రలో బలం ఉండి..మంచి నటుడుగా నిరూపించుకునే అవకాశం ఉంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఎన్నో ఆశలతో నర్తనశాల సినిమాకు వెళ్లిన ప్రేక్షకుల నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. ఏ దశలోనూ ఈ సినిమా ప్రేక్షకులను రంజింప చేయలేకపోయింది. కామెడీ కూడా మరీ చౌకబారుగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా హాయిగా నవ్వుకునే సందర్బమే లేదు. మంచి నటుడు అయిన శివాజీరాజాకు ఈ సినిమాలో చాలా ‘అతి’ పాత్ర ఇచ్చారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే శివాజీరాజా చనిపోయిన తన తల్లి కూతురు రూపంలో పుడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆయనకు కొడుకే పుడతాడు. అయితే ఈ విషయం తెలిస్తే తన తండ్రి ఎక్కడ చనిపోతాడో అనే భయంతో అమ్మాయిగానే పెంచుతాడు. చిన్నప్పటి నుంచి అమ్మాయిగా పెరిగిన హీరో నాగశౌర్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇంట్లో వాళ్లు అడిగినప్పుడు తనకు ఆ ఫీలింగ్ కలగటం లేదని చెప్పి వాళ్లను షాక్ కు గురిచేస్తాడు. అంతే కాకుండా అమ్మాయిలకు రక్షణగా నిలుస్తూ..వారిపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు శిక్షణ ఇచ్చే ఓ కేంద్రాన్ని నెలకొల్పుతాడు. ఈ దశలోనే నన్ కావాల‌నుకునే అమ్మాయి మేఘ‌న‌(కశ్మీర ప‌ర‌దేశి)ని ఆమె కష్టాల నుంచి కాపాడతాడు.

ఆ క్రమంలోనే మేఘ‌న హీరోతో ప్రేమ‌లో ప‌డుతుంది. అలాగే రాయుడు అమ్మాయి అయిన స‌త్య‌భామ‌(యామినీ భాస్క‌ర్‌) కూడా హీరోని చూసి ప్రేమ‌లో ప‌డుతుంది. స‌త్య‌భామ‌ను త‌న కొడుకు ప్రేమిస్తున్నాడ‌ని అర్థం చేసుకుని క‌ల్యాణ్ ఆమె తండ్రితో సంబంధం క‌లుపుకోడానికి వెళ‌తాడు. పెళ్లి నిశ్చ‌య‌మైన త‌ర్వాత కొడుకు, మేఘ‌న‌ని ప్రేమిస్తున్నాడ‌ని తెలుసుకుంటాడు. కానీ రాయుడుని ఎదిరించ‌లేడు. నాగశౌర్య తన పాత్రకు న్యాయం చేసేలా నటించినా కథలో సత్తా లేకపోవటంతో ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తాడు. హీరోయిన్స్ క‌శ్మీర ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్ విష‌యానికి వ‌స్తే ఇద్ద‌రికీ స్క్రీన్ ప్రెజ‌న్స్ త‌క్కువ‌గా ఉంది. యామినీ ఓ పాట‌లో అందాల ఆర‌బోసేసింది. మొత్తంగా చూస్తే నిజంగానే నర్తనశాల ‘తేడా’ సినిమానే.

రేటింగ్. 1.75/5

Next Story
Share it