Telugu Gateway
Andhra Pradesh

రాజధాని టూ సాగునీటి శాఖ అదే దోపిడీ!?

రాజధాని టూ సాగునీటి శాఖ అదే దోపిడీ!?
X

ప్రస్తుతం రాజధాని పనుల్లో మొబైలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా పది నుంచి పదిహేను శాతానికి పెంచారు. ఇది ఓ పెద్ద దోపిడీగా మారబోతోంది. పనులు అప్పగించి ‘కమీషన్లు’ తీసుకుని ఎవరి పని వారు చూసుకుంటారు. పనులు అయినప్పటికి అవుతాయి. ముందు మన ‘వాటా’ మనకొస్తే చాలు అనుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. రాజధానికి అమలు చేసిన మోడల్ నే ఇప్పుడు సాగునీటి శాఖకు కూడా విస్తరించే దిశగా సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సాగునీటి శాఖలోనూ మొబిలైజేషన్ అడ్వాన్స్ పది శాతమే ఉంది. దీన్ని 12.5 శాతానికి పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు గత కొంత కాలంగా కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం గురించి పదే పదే ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలవబోతున్నారు. ఈ సోమవారం నాడు జరిగిన పోలవరం సమీక్ష సమయంలో కూడా చంద్రబాబు టెండర్లకు అంతా రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు.

సహజంగానే ప్రతి ప్రాజెక్టులోనూ అంచనాల పెంపు ఎంతో కొంత ఉంటుందనేది బహిరంగ రహస్యం. దానికి తోడు ఇప్పుడు కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్ లను కూడా పెంచేసి అందినంత దండుకునే పనిలో ఉన్నారు. అందులో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల తర్వాత అధికారంలోకి ఎవరు వస్తారో తెలియదు. అందుకే ముందుగానే టెండర్లు పిలిచేసి..కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేసి అందినంత దోచుకోవటానికే ఈ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే టెండర్ల పిలిచే కార్యక్రమాలు ఆగమేఘాల మీద పూర్తి చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల లోపు ఎంత వీలు అయితే అంత దండుకోవాలనే దిశగానే అడుగులు వడివడిగా పడుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it