Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ ది త్యాగమా...భయమా!?

టీఆర్ఎస్ ది త్యాగమా...భయమా!?
X

‘మేం అధికారాన్ని త్యాగం చేసి ముందస్తుకు వెళితే..ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న పార్టీలు సంతోషించాలి కదా?.’ ఇదీ తెలంగాణ, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ ఆదివారం నాడు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఒకింత విచిత్రంగానే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారం త్యాగం చేయమని ఎవరూ అడగలేదు. చేతిలో ఉన్న అధికారాన్ని త్యాగం చేయటం ఎందుకు?. మళ్ళీ అడగటం ఎందుకు?. సమయం అంతా అయిపోయిన తర్వాతే అడగొచ్చు కదా?. చేతిలో ఉన్న ఎనిమిది నెలల అధికారాన్ని వదులుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది?. పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా 2018 లోపు ఎన్నికలు పూర్తయితేనే మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్పింది నిజమా?. లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే అప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగి తిరిగి అధికారంలోకి రావటం కష్టమనే అభిప్రాయం పార్టీ అధినేతలో ఉందా?. అంతిమ నిర్ణేతలు అయిన ప్రజలేమీ మాకు ముందస్తు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేయటం లేదు కదా?.

పరిపాలనా పరంగా..రాజకీయ పరంగా అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఎలాంటి ‘రహస్య ఏజెండా’ లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది?. ఓ వైపు దేశంలో ఎవరూ చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలు..అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకుంటూ అధికార పార్టీ ఎందుకు అంత హైరానా పడుతుంది?. ఓ వైపు జమిలి ఎన్నికలకు జై కొట్టి రాష్ట్ర ప్రజలపై ఓ సారి అసెంబ్లీకి, మరో సారి పార్లమెంట్ ఎన్నికలు ప్రజల నెత్తిన రుద్దాల్సిన అవసరం ఏముంది?. ఏపీ, తెలంగాణకు షెడ్యూల్ ప్రకారం అయితే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసే వస్తాయి కదా?. రెండుసార్లు ఎన్నికలు నిర్వహించటం వల్ల అదనపు వ్యయం సంగతేంటి?. అంతుబట్టని రాజకీయ ప్రయోజనాలు, రహస్య ఏజెండా లేకపోతే ప్రభుత్వం ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నదీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా?. అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మా ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటాం..ప్రజలు దీన్ని ఫాలో అవ్వాల్సిందే అని చెబుతారా?. ఓట్లు వేయాల్సిన ప్రజలకు సహేతుకమైన కారణాలు ఉంటే చెప్పటంలో తప్పేం ఉంటుంది?. ఇవన్నీ ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.

Next Story
Share it