Telugu Gateway
Telangana

చెల్లని కెటీఆర్ మాట ..ఎమ్మెల్యేదే విజయం

చెల్లని కెటీఆర్ మాట ..ఎమ్మెల్యేదే విజయం
X

తెలంగాణ రాష్ట్ర ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ కు సొంత పార్టీలోనే ఝలక్.రామగుండం మేయర్ ను కాపాడాలని మంత్రి కెటీఆర్ ప్రయత్నిస్తే..ఎలాగైనా తప్పించాలని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చూశారు. చివరకు మంత్రి, అధిష్టానం మద్దతు ఉన్నమేయర్ ను పదవి నుంచి తప్పించేశారు. దీంతో కెటీఆర్ ఫెయిల్..ఎమ్మెల్యే విజయం సాదించినట్లు అయింది. ఈ పరిణామం టీఆర్ఎస్ లో ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే సోమారపు, మేయర్ మధ్య విభేదాలు తలెత్తాయి. అందుకే ఎమ్మెల్యే అనుచర కార్పొరేటర్లు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఠాట్ అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకుంటారా? లేదా అని మంత్రి కెటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు కూడా ఈ విషయం గట్టిగానే చెప్పారు. అంతే ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తొలుత అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మంత్రి కెటీఆర్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తే ..ఆయన వాదన వినటానికి కూడా మంత్రి కెటీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు.

తర్వాత సోమారపు రాజకీయం సన్యాసం ప్రకటన చేయటంతో మంత్రి కెటీఆర్.. ఎమ్మెల్యేను పిలిపించి మాట్లాడారు. ఆయన కూడా కెసీఆర్, కెటీఆర్ చెప్పినట్లు నడుచుకుంటానని వెళ్లిపోయారు. కానీ అవిశ్వాస తీర్మానం మాత్రం ఆగలేదు. దీంతో సొంత పార్టీ మేయర్ ను కూడా అధిష్టానం రక్షించలేకపోయింది. మేయర్ తోపాటు డిప్యూటీ మేయర్ ను కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా దించేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అసమ్మతి రాజకీయాలను తెలియజేస్తోంది. అంతే కాదు..ఎమ్మెల్యే బలంగా ఉన్న చోట అధిష్టానమే వారి మాట వినాల్సిన పరిస్థితి ఉంటుందని సోమారపు సత్యనారాయణ విజయవంతంగా నిరూపించారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ కు ఎనిమిది టీఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎలాగైనా అవిశ్వాస తీర్మానం ఉపసంహరింపచేయాలని ప్రయత్నించిన మంత్రి కెటీఆర్ అందులో విఫలం కావటం.!.

Next Story
Share it