Telugu Gateway
Telangana

కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వదిలేశారా!?

కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వదిలేశారా!?
X

కాంగ్రెస్..బిజెపికి వ్యతిరేకంగా అని....మోడీకి దగ్గరైన టీఆర్ఎస్ అధినేత

‘ఈ దేశానికి కాంగ్రెస్, బిజెపి చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇదేనా వీళ్లు దేశానికి చేసింది. ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కలుపుకుని పోయి..దేశానికి ఓ దిశా..నిర్దేశం చేస్తా’ ఇదీ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన ప్రకటన. అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేసిన కెసీఆర్ ఇప్పుడు బిజెపితో కలసి ముందుకు సాగేందుకు సిద్ధమైనట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ తో ఢిల్లీలో భూకంపం పుట్టిస్తామని గర్జించిన కెసీఆర్ ఇఫ్పుడు ప్రధాని మోడీతో సయోధ్యకు వెళ్ళారు. కొన్ని రోజుల పాటు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హంగామా చేసిన టీఆర్ఎస్ అధినేత ఇఫ్పుడు యూటర్న్ తీసుకోవటానికి కారణం ఏంటి?. దేశానికి ఏమీ చేయని బిజెపితో కెసీఆర్ సాన్నిహిత్యం దేనికోసం? అన్న ప్రశ్నలు ఉదయించటం సహజం. కాంగ్రెస్, బిజెపి రహిత ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హంగామా చేసిన సీఎం కెసీఆర్ కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జనతాదళ్ (ఎస్) అధినేత దేవేగౌడ, కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లతో భేటీ అయి చర్చలు జరిపారు.

ఒరిస్సా ముఖ్యమంత్రి బిజుపట్నాయక్ తో సమావేశం అయ్యేందుకు ప్రయత్నించినా..అది సాధ్యం కాలేదు. తాజా పరిణామాలతో జాతీయ స్థాయిలో వివిధ పార్టీలు ఇప్పుడు కెసీఆర్ వైపు అనుమానపు చూపులు చూసే అవకాశం లేకపోలేదు. పొరుగు రాష్ట్రం ఏపీ దగ్గరకు వచ్చేసరికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బహిరంగంగా వ్యాఖ్యానించిన కెసీఆర్, కవితలు అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ ను లేవనెత్తటం విశేషం. ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకే ఇలాంటి వాదన తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందే బిజెపికి మేలు చేసేందుకు అన్న విమర్శలు కూడా విన్పించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇదే అంశాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై లోక్ సభ సాక్షిగా ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో తెలంగాణ బిజెపి ఇరకాటంలో పడినట్లు అయింది. వచ్చే ఎన్నికల్లో బిజెపి టీఆర్ఎస్ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అన్నదీ వేచిచూడాల్సిందే.

Next Story
Share it