Telugu Gateway
Telangana

ఈవెంట్ ప్రెస్ క్లబ్ ది...పేమెంట్ కాంగ్రెస్ పార్టీది

ఈవెంట్ ప్రెస్ క్లబ్ ది...పేమెంట్ కాంగ్రెస్ పార్టీది
X

సభ్యులందరికీ ఉపయోగపడాల్సిన ప్రెస్ క్లబ్ ను కొంత మంది నాయకులు తమ సొంత అవసరాలు..ఇమేజ్ పెంచుకోవటానికి ఇష్టానుసారం వాడుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్బంగా నిర్వహించిన ‘ఎడిటర్స్ మీటింగ్’ అలాంటిదే. ఈ సమావేశాన్ని నిర్వహించింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్. నగరంలోని హరిత ప్లాజా హోటల్ లో ఇది జరిగింది. అయితే ఈ సమావేశం నిర్వహించానికి అయిన బిల్లును కాంగ్రెస్ పార్టీ చెల్లించింది. ప్రెస్ క్లబ్ రాహుల్ గాంధీతో ఎడిటర్స్ మీటింగ్ పెట్టదలచుకుంటే ఎవరికీ అభ్యతరం ఉండదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ దానికి అయ్యే ఖర్చును భరించటానికి సిద్ధపడితేనే ఈ సమావేశం పెట్టాలి. లేదంటే మౌనంగా అయినా ఉండాలి. కానీ ప్రెస్ క్లబ్ పేరుతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీతో బిల్లు కట్టించారంటే..అంటే ప్రెస్ క్లబ్ ను కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందా? అన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

సభ్యుల కోసం నిర్వహించే కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకుల నుంచి విరాళాలు తీసుకోవటం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇలా ఓ నాయకుడితో సమావేశానికి ఆ పార్టీతోనే డబ్బు కట్టించటం అనైతికం. ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో కీలక స్థానాల్లో ఉన్న కొంత మంది వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవటానికి..నేతలతో సంబంధాలకు ప్రెస్ క్లబ్ ను వాడుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు లక్ష్యాలే పూర్తిగా గాడితప్పాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. క్లబ్ ప్రధాన ఉద్దేశం ఫ్రొఫెషనల్ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు...సభ్యులకు మెరుగైన సౌకర్యాలు అందించటం. ఇక క్లబ్ లో సభ్యులు సౌకర్యాల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఎవరికి వారు వ్యక్తిగత ఏజెండాతో వెళుతూ సభ్యులందరికీ ఉపయోగపడాల్సిన క్లబ్ ను తమ సొంత ఇమేజ్ పెంచుకోవటానికి ఉపయోగించుకోవటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా క్లబ్ ఓ పార్టీ తరపున పనిచేసేలా ఉండటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it