Telugu Gateway
Telangana

కన్ఫ్యూజన్ కెసీఆర్ దా...పత్రికలదా!

కన్ఫ్యూజన్ కెసీఆర్ దా...పత్రికలదా!
X

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఏ విషయంలో అయినా స్పష్టతతో ముందుకు సాగుతారు. నిర్ణయాలు కూడా అంతే వేగంగా తీసుకుంటారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆయన స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే..ముందస్తుకు పోవాల్సిన అవసరం ఏముంది?. దీనికి ఓ కారణం చెప్పు అంటూ ఇప్పుడు ప్రతిపక్షాలు సర్కారు వెంటపడుతున్నాయి. కాంగ్రెస్ అయితే ముందస్తు ఎంత తొందరగావస్తే అంత మంచిది..ఎందుకంటే కెసీఆర్ ఎలాగూ ఇంటికే పోతారు అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. బుధవారం నాడు మంత్రులతో సీఎం కెసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అందులో ముందస్తు ఎన్నికలతోపాటు..రాజకీయ వ్యూహాలు..జిల్లాల వారీ పరిస్థితులు అన్నీ చర్చించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ మీటింగ్ కు సంబంధించి ప్రధాన పత్రికలు అన్నీ ఒక్కో రకంగా రాశాయి. ఓ పత్రిక అయితే ముందస్తు లేదని తేల్చేస్తే..మరో పత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కెసీఆర్ ఆదేశించినట్లు రాశారు. మరో పత్రిక మాత్రం ముందస్తుపై మీదే ఫైనల్ అని కెసీఆర్ కు అధికారం కట్టబెట్టారంట. అసలు కెసీఆర్ మంత్రులనే పట్టించుకోవటం లేదని చెబుతుంటే...ఆ మంత్రులందరూ కలసి కెసీఆర్ కు అధికారం ఇవ్వటం ఏంటి? వెరైటీ కాకపోతే.

గత కొంత కాలంగా సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ టీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడినా వంద సీట్లకు తగ్గవని వాదిస్తూ వస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అంత సవ్యంగా లేదని..ఎన్నికలు ఎంత జాప్యం అయితే అంత నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే కెసీఆర్ ముందస్తుకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం దారుణంగా ఉందని..వేల కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు పెండింగ్ లో పడిపోయిందని చెబుతున్నారు. అంతే కాదు..ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లించటానికి కూడా నిధులు లేకే తర్జనభర్జన పడుతున్నారని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇఛ్చిన హామీలు...చెల్లించాల్సిన బిల్లులు..వచ్చే ఆదాయం మధ్య పొంతన కుదరక ఆర్థిక శాఖ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే వీలైనంత తొందరగా అంటే ప్రతికూలతలు పెరగక ముందే ఎన్నికలకు పోయి..మరోసారి ఛాన్స్ దక్కించుకోవాలనే ప్లాన్స్ లో కెసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ముందస్తు పక్కా అని..ఎప్పుడో ఎన్నికలు ఉంటే సెప్టెంబర్ 2న కెసీఆర్ అంత భారీ మీటింగ్ పెట్టి ఏమి చేసుకుంటారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it