Telugu Gateway
Movie reviews

‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ

‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ
X

ఆ కుర్ర నటుడు పెద్ద హీరోయిజం క్వాలిటీలు ఉన్న వ్యక్తేమీ కాదు. హీరోయిన్ కు ఏ ఇమేజూ లేదు. హీరో సుశాంత్ గత సినిమాల ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. హీరోయిన్ కు ‘గత’ చరిత్ర అంటూ పెద్దగా ఏమీ లేదు. కానీ పాత సుశాంత్ ‘చి.ల.సౌ.’ సినిమాతో కొత్తగా మారిపోయాడు. హీరోయిన్ రుహానీ శర్మ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమా కథలో దమ్ము..కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి. సుశాంత్ మొత్తానికి ‘చి.ల.సౌ.’సినిమాతో ఫ్యామిలీ అంతా కలసి చూసే ఓ సినిమాతో హిట్ కొట్టారనే చెప్పొచ్చు. పెద్దగా బోర్ లేకుండా..సినిమా అంతా కూల్ గా సాగిపోతే అంతకంటే ప్రేక్షకుడి ఏమి కోరుకుంటాడు. అక్కడక్కడ స్లో గా ఉన్నట్లు అన్పించినా అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీలేదు. ఓవరాల్ గా చూస్తే ‘చి.ల.సౌ.’ ఓ కొత్త ప్రయోగం. అందులో ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహించింది యువ హీరో రాహుల్ రవీంద్రన్ కావటం మరో విశేషం. దర్శకుడు కావటానికి అని పరిశ్రమలోకి వచ్చి హీరోగా..ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు దర్శకుడిగా మారి..తన సత్తా ఏంటో చూపించాడు.

ఈ సినిమా అంతా హీరో పెళ్లి చుట్టూ తిరుగుతుందనే విషయం ట్రైలర్..టీజర్లలోనే చూపించారు చిత్ర యూనిట్. ఇప్పట్లో పెళ్లి వద్దనుకునే హీరోకు..పెళ్ళి చూపులు...ఆ తర్వాత జరిగే సీన్లే ఈ సినిమా అంతా. పెళ్లి ప్రతిపాదనను ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునే పాత్రలో సుశాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమా అంతా ఎక్కువ భాగం హీరో..హీరోయిన్ల మధ్యనే తిరుగుతుంటుంది. హీరో ఫ్రెండ్ గా వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ గా పరిచయం అయిన రుహాని శర్మ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. హీరోయిన్‌ తల్లిగా రోహిణి, హీరో తల్లి దండ్రులుగా అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌, ఇతర పాత్రల్లో విద్యుల్లేఖ రామన్‌, జయప్రకాష్ లు కూడా బాగానే సందడి చేశారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించే. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. సినిమాలో పెళ్లిచూపులు సీన్‌ మొదలైన తరువాత కథనం ఆసక్తికరంగా మారుతుంది.

రేటింగ్. 3/5

Next Story
Share it