Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు హామీని మోడీ నిలబెట్టాలా!

చంద్రబాబు హామీని మోడీ నిలబెట్టాలా!
X

గత ఎన్నికల్లో ఇద్దరూ కలసి ప్రచారం చేసుకున్నారు. అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో అధికారం పంచుకున్నారు. తర్వాత ఎవరికి వారు తూచ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హామీని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీ దే అంటున్నారు. విభజిత ఏపీకి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలనే ప్రధాని నరేంద్రమోడీ అమలు చేయటం లేదు. అలాంటిది రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇచ్చిన హామీని మోడీ అమలు చేస్తారా?. అంటే ఖచ్చితంగా అది జరిగే పనికాదని చెప్పొచ్చు. కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి..ప్రయోజనం పొందటంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశాన్ని కూడా మరోసారి అదే తరహాలో వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓ వైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే అసలు విషయం చెప్పకనే చెప్పేశారు. కాపుల రిజర్వేషన్ కేంద్రం పరిధిలోనే ఉందని..పార్లమెంట్ లో తీర్మానం చేస్తేనే అది సాధ్యం అవుతుందని తేల్చిచెప్పారు.

పలు సందర్భారాల్లో ప్రధాని మోడీ కూడా రిజర్వేషన్ల అంశంపై కుండబద్దలు కొట్టినట్లు తేల్చేశారు. 50 శాతం పైన రిజర్వేషన్లు అమలు చేయటం సాధ్యంకాదని..అలా కాకుండా ఎవరూ ఏమి చెప్పినా నమ్మోద్దని తేల్చిచెప్పారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు 50 శాతంపైన రిజర్వేషన్లు అమలు చేయించుకోలిగాయి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ఉన్న కమిట్ మెంట్...కేంద్రంపై ఒత్తిడి చేసే విధానమే భిన్నం. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు ఓ ఐదు నిమిషాలు పార్లమెంట్ లో గొడవ చేసి కూర్చుంటే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయా?. పోనీ చంద్రబాబుకు ఇప్పుడు మోడీతో ఏదో పంచాయతీ వచ్చింది కాబట్టి ఆయనపై కక్ష కట్టి చేయటం లేదు అనుకుందాం. కానీ ప్రధాని మోడీతో ఎంతో సఖ్యతతో ఉంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ దీ అదే పరిస్థితి. పైగా ఈ మధ్యే మోడీ లోక్ సభలో కెసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు కూడా. ముస్లిం రిజర్వేషన్ల ను 12 శాతానికి పెంచుతూ తెలంగాణ కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపింది.

కానీ కాపు రిజర్వేషన్ల తరహాలో ఇది కూడా పక్కన పెట్టేసింది కేంద్రం. ఎస్టీల రిజర్వేషన్ల పెంపుది కూడా ఇదే తీరు. ఎస్టీల రిజర్వేషన్ ను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. కేంద్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. సీఎం కెసీఆర్ కూడా వీటి గురించి పెద్దగా కేంద్రాన్ని నిలదీస్తున్నది లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయితే తూతూమంత్రంగా కమిటీ నివేదిక తెప్పించుకుని ఏదో చేశానంటే చేసినట్లు పంపించేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ కేంద్రం పరిధిలోని అంశం అని ప్రకటించటంతో రాజకీయంగా రచ్చ చేసి లబ్దిపొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా అత్యంత కీలకంగా మారనుంది.

Next Story
Share it