Telugu Gateway
Telangana

తెలంగాణ కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం

తెలంగాణ కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం
X

కొత్త జిల్లాలు. కొత్త జోన్లు. తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గురువారం నాడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన కెసీఆర్ తక్షణమే జోన్లకు ఆమోదం తెలపాలని కోరారు. అందుకు తగినట్లుగానే కేంద్రం కూడా వేగంగా స్పందించింది. తెలంగాణలో ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్‌ వ్యవస్థ అడ్డంకిగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతున్నారు. దానికి అనుగుణంగా జోనల్‌ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగానే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణాను 31 జిల్లాలుగా చేసి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని గుర్తించారు.

తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. మరోవైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. కొత్త జోనల్‌ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే జిల్లా పోస్టులే కాదు మల్టీజోన్‌ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయించిన 34 రకాల కేటగిరీ పోస్టుల్లో మరో 21 రకాల జోనల్‌ కేటగిరీ పోస్టులు 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. తెలంగాణలోని నిరుద్యోగ యువతకే, అందులోనూ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ...

కాళేశ్వరం జోన్‌..జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు.

బాసర జోన్‌...జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు.

రాజన్న జోన్‌...జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు.

భద్రాద్రి జోన్‌...జిల్లాలు: వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు

యాదాద్రి జోన్‌...జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు

చార్మినార్‌ జోన్‌...జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు

జోగుళాంబ జోన్‌...జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు.

మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు...

  1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
  2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ.

Next Story
Share it